Begin typing your search above and press return to search.

ఎలక్షన్లలో పోటీచేస్తే అంత పెద్ద శిక్షా?

By:  Tupaki Desk   |   14 Nov 2015 10:58 AM GMT
ఎలక్షన్లలో పోటీచేస్తే అంత పెద్ద శిక్షా?
X
కేరళలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో పోటీ చేసిన ఓ మహిళకు దారుణమైన అవమానం జరిగింది. ఆమెపై సీపీఎం నాయకులు దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసిన ఓ కాంగ్రెస్ నాయకురాలిని పట్టుకుని కట్టేసి ఆమె జుత్తు కట్ చేశారు సీపీఎం నాయకులు. ఈ విషయంపై కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలకు ప్రత్యర్థి పార్టీల మీద అసహనం పెరిగిపోతోందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని ఉమెన్ చాందీ అన్నారు. ఇలాంటి సంఘటనలను తాము చూస్తూ ఊరుకోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

తిరువనంతపురం జిల్లాలోని పెరుంకడవిలా ప్రాంతంలో సతికుమారి (50) అనే మహిళ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ఉన్నారు. గత నెలలో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికలలో సీపీఎం అభ్యర్థిపై సతికుమారి పోటి చేశారు. సతికుమారికి కేవలం 814ఓట్లు రావడంతో ఆమె ఓడిపోయారు. అయితే, ఆమె ఓడిపోయినప్పటికీ తమపైనే పోటీ చేస్తావా అంటూ అప్పటి నుంచి సీపీఎం నాయకులు సతికుమారి మీద కక్ష పెంచుకున్నారు. ఈనెల 11వ తేదిన తిరువనంతపురంకు20 కిలోమీటర్ల దూరంలోని అమరవిలా ప్రాంతంలో సతికుమారిని ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నారు. తరువాత ఆమె జుట్టు కత్తిరించి చేతిలో పట్టుకుని ఈ సారి మా మీద పోటి చేస్తే మరింత అవమానం తప్పదని హెచ్చరించి అక్కడి నుంచి పారిపోయారు.

కాగా సతికుమారి జిల్లా స్థాయి నాయకురాలు. ఆమె అక్కడ డీసీసీ సభ్యురాలు కూడా. అలాంటిది ఆమెపైనే దాడి చేస్తే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.