Begin typing your search above and press return to search.

సీబీఐ సత్తా తేలిపోయిందిగా?

By:  Tupaki Desk   |   22 Dec 2017 2:30 AM GMT
సీబీఐ సత్తా తేలిపోయిందిగా?
X
ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేరవిచారణ - దర్యాప్తు సంస్థలు కొన్ని సందర్భాలలో ఆయా ప్రభుత్వాల భావజాలానికి - ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఉండడం జరుగుతుంది. ప్రతిసారీ అవి నికార్సుగా వ్యవహరిస్తాయని అనుకోవడానికి వీల్లేదు. రాజకీయ ప్రేరేపిత విచారణలు కూడా అనేకం సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు 2జీ కుంభకోణం విషయంలో కూడా అలాంటి అనుమానాలే ప్రజల్లో కలుగుతున్నాయి. కాకపోతే కాంగ్రెసు హయాంలో జరిగిన అవినీతి గురించి... ఆ ప్రభుత్వ హయాంలోనే విచారణ కూడా ప్రారంభం అయింది. నిజానికి 2జీ స్పెక్ట్రం కేటాయింపులను సుప్రీం కోర్టు ఎన్నడో రద్దు చేసేసింది గానీ.. నేరానికి సంబంధించిన విచారణ మాత్రం ఇన్నాళ్లు సాగింది. ఇవాళ అందరూ నిర్దోషులని తేలింది.

అయితే.. సీబీఐ సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోయినందున.. అందరినీ నిర్దోషులుగా పరిగణిస్తున్నట్లుగా కోర్టు ప్రకటించడం ఇక్కడ కీలకాంశం. అంటే సీబీఐ రాజకీయ ప్రేరేపితంగానే సాక్ష్యాలను సేకరించలేకపోయినా అనే అనుమానం ఎవరికైనా కలిగితే ఆశ్చర్యం ఏముంది.

ఇలాంటి నేపథ్యంలో జగన్ మీద ఉన్న ఆరోపణల విషయాలు కూడా జనంలో ప్రస్తావనకు వస్తున్నాయి. వైఎస్ జగన్ గురించి కోట్లకు కోట్ల రూపాయల అక్రమాలు జరిగిపోయినట్లు ఆరోపణలు గుప్పించిన సీబీఐ - ఇన్ని సంవత్సరాలుగా న్యాయస్థానంలో విచారణ జరుగుతూ ఉంటే.. ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్కటైనా ఆరోపణలు నిరూపించే సరైన సాక్ష్యాధారాలను సమర్పించకపోవడం గమనార్హం.

సీబీఐ వ్యవహరించే తీరు ఎలా ఉంటుందో అనడానికి ఇదే నిదర్శనం అని పలువురు అంటున్నారు. సాక్ష్యాలను సేకరించడమూ - నేరాన్ని నిరూపించడమూ ఇవన్నీ తర్వాతి సంగతులు.. ముందుగా ఆరోపణల బురద చల్లేసి.. అరెస్టు చేసి జైల్లో పెట్టించేసి.. రాజకీయంగా బద్నాం చేసి.. రాజకీయంగా తామంటే కిట్టని వారిని బలిపశువుల్ని చేయడానికి సీబీఐ అధికార పార్టీలకు ఒక ఉపకరణం లాగా ఉపయోగపడుతూ ఉంటుందనడానికి ఇది ఒక తాజా నిదర్శనం మాత్రమే అని కూడా ప్రజల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ మీది ఆరోపణల విషయంలోనూ అసలు అక్రమాలే లేవని, అంతకు మించి ఆధారాలూ లేవని - ఇక సీబీఐ ఆ కేసు విషయంలో కూడా ఏదో ఒక రోజు చేతులెత్తేయాల్సిందే అని కూడా అప్పుడే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.