Begin typing your search above and press return to search.

ఆన్ లైన్లో ఆగమాగం చేసేస్తున్నారుగా?

By:  Tupaki Desk   |   10 Oct 2019 5:30 AM GMT
ఆన్ లైన్లో ఆగమాగం చేసేస్తున్నారుగా?
X
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఎపిసోడ్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు గతంలో ఎప్పుడూ ఎదురుకాని సిత్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమ్మెను ఉక్కుపాదంతో అణిచివేసేలా.. రాబోయే రోజుల్లో యూనియన్లు అన్నవి మనుగడలో లేకుండా చేయటంతో పాటు.. మరే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సమ్మె లాంటి మాటల్ని కలలో కూడా ఆలోచించకూడదన్నట్లుగా కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.

ఉద్యమాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రి.. ఉద్యమాలు చేసే వారిపై ఇంత కఠినంగా వ్యవహరిస్తారా? అన్న విస్మయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. కేసీఆర్ తీరును బాహాటంగా విమర్శిస్తున్న వారి కంటే.. సోషల్ మీడియాలో ఈ జోరు మరింత ఎక్కువగా ఉంది.

చిత్ర.. విచిత్రమైన రీతిలో ఆయనపై పంచ్ లు వేస్తున్నారు. ఒకటిన్నర లక్షల పుస్తకాలు చదివినోడు.. యాభై వేల ఉద్యోగాలు పీకినోడు ఎవరు? లాంటి ప్రశ్నలు వేస్తూ సారు ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేస్తున్నారు. నిజానికి ఇక్కడ ప్రస్తావించింది తక్కువ మోతాదులో ఉన్న సటైరుగా చెప్పాలి. వ్యంగ్య వ్యాఖ్యలు.. వీడియోలతో కేసీఆర్ మీద ఒక రేంజ్లో విరుచుకుపడుతున్నారు.

గతంలో కేసీఆర్ కు అనుకూలంగా ఆన్ లైన్ లో వచ్చే పోస్టులకు భిన్నమైన వాతావరణం తాజా ఎపిసోడ్ లో కనిపిస్తుండటం గమనార్హం. వివిధ వర్గాలకు చెందిన వారంతా కేసీఆర్ తీరుపై ఆగ్రహంతో ఉండటం.. యాభై వేల ఉద్యోగాల్ని ఒక్క మాటతో తీసేసినట్లుగా చెబుతున్న తీరును తప్పు పడుతున్నారు.

ఉద్యమాలతో తెలంగాణను సాధించుకున్న వారినే.. ఉద్యమాలు చేయొద్దని చెప్పటమా? ఇదెక్కడి దారుణమన్న ఆగ్రహం పలువురి నోట వినిపిస్తోంది. ఆన్ లైన్లో తన ఇమేజ్ ను అదే పనిగా డ్యామేజ్ చేస్తున్న వారిపై కేసీఆర్ ఎలా కంట్రోల్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.