Begin typing your search above and press return to search.

ప్ర‌తి ప‌థ‌కం చివ‌రా ఈ 16 ఏంది కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   18 Oct 2018 4:12 AM GMT
ప్ర‌తి ప‌థ‌కం చివ‌రా ఈ 16 ఏంది కేసీఆర్‌?
X
వ‌రాల మీద వరాలు ప్ర‌క‌టిస్తున్న ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరుపై ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోకుల మీద జోకులు పేలుతున్నాయి. తాజాగా ఆయ‌న త‌మ పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టోకు సంబంధించి టీజ‌ర్ రిలీజ్ చేయ‌టం జ‌రిగింది.
ఓవైపు కాంగ్రెస్ పార్టీ త‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించకున్నా.. ఎన్నిక‌ల్లో తాము గెలిచి అధికారంలోకి వ‌స్తే ఏమేం చేస్తామ‌న్న విష‌యంపై క్లారిటీగా హామీలు ఇస్తున్న వేళ‌.. అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించినా.. మ‌ళ్లీ ప‌వ‌ర్లోకి వ‌స్తే ఏం చేస్తామో చెప్పేందుకు ఎలాంటి హామీ ఇవ్వ‌లేదు గులాబీ అధినేత‌. దీంతో.. ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళుతున్న గులాబీ అభ్య‌ర్థులు తాము చెప్పేందుకు ఏమీ లేద‌న్న మాట‌ను అధినేత వ‌ద్ద మొర‌పెట్టుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

అదే స‌మ‌యంలో హామీల మీద హామీల‌తో కాంగ్రెస్ దూసుకెళ్ల‌టం.. గులాబీ కారు జోరు త‌గ్గింద‌న్న వాద‌న‌ల‌తో పాటు.. ముంద‌స్తుకు వెళ్లే వేళ‌లో క‌నిపించిన జోష్ లో తేడా రావ‌టంతో కేసీఆర్ అలెర్ట్ అయిన‌ట్లుగా చెబుతారు. ఈ వాద‌న‌కు త‌గ్గ‌ట్లే తాజాగా ఎన్నిక‌ల మేనిఫెస్టోకు సంబంధించిన కొన్ని ముఖ్య‌మైన అంశాల్ని రివీల్ చేసిన కేసీఆర్ భారీ హామీలు ఇవ్వ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మొన్న‌టివ‌ర‌కూ కాంగ్రెస్ చెబుతున్న నిరుద్యోగ భృతిని గేలి చేసిన టీఆర్ఎస్ అధినేత‌లు.. ఇప్పుడు తాము కూడా ఇస్తామ‌ని చెప్ప‌ట‌మే కాదు.. నిరుద్యోగ భృతి కింద రూ.3016 ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంతేనా.. వృద్ధుల‌కు నెల‌కు రూ.2016 అని.. దివ్యాంగుల పింఛ‌ను రూ.3016కు పెంచుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు.

ప్ర‌తి ప‌థ‌కానికి చివర్లో రూ.16 ఉండటం క‌నిపిస్తుంది. దీనిపై సోష‌ల్ మీడియాలో వ్యంగ్య‌స్త్రాల్ని సంధిస్తున్నారు. అన్నా.. ఈ రూ.16 ఏందే? అన్న ప్ర‌శ్న‌ను కొంద‌రు వేస్తుంటే.. మ‌రికొంద‌రు ఎన్నిక‌ల వేళ‌.. కేసీఆర్ సారు ప్ర‌జ‌ల‌కు చెల్లిస్తున్న జీఎస్టీ బ్ర‌ద‌ర్ అంటూ వ్యాఖ్య‌లు చేసుకోవ‌టం క‌నిపిస్తోంది. చూస్తుంటే.. త‌న‌కు అదృష్ట‌సంఖ్య‌గా భావించే ఆరో నెంబ‌రు చివ‌ర్లో వ‌చ్చేలా జాగ్ర‌త్త ప‌డ్డార‌ని చెబుతున్నారు.

ఉత్త ఆరు అయితే బాగోద‌ని ప‌ద‌హారు చేశార‌న్న మాట‌కు.. అదేదో నూట‌ప‌ద‌హార్లు చేస్తే బాగుండేది క‌ద‌న్నా అన్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ప‌ద‌హారు అయితే ఓకే కానీ.. దానికి అద‌నంగా వంద చేరితే.. మొత్తంగా వేలాది కోట్ల భారం అద‌నంగా ప‌డే అవ‌కాశం ఉంద‌ని.. అందుకే .. ప‌ద‌హారుకు ప‌రిమితం చేసి ఉంటార‌న్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. కేసీఆర్ ల‌క్కీ నెంబ‌రుగా భావించే ఆరుపై మ‌రోసారి ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు కార‌ణ‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.