Begin typing your search above and press return to search.

మోడీ మాట‌లు... మోడీకి వ‌ర్తించ‌వా?

By:  Tupaki Desk   |   28 Nov 2018 8:29 AM GMT
మోడీ మాట‌లు... మోడీకి వ‌ర్తించ‌వా?
X
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్ర‌సంగాల‌కు పేరు. కానీ అత‌ను ప్ర‌సంగాలు మాత్ర‌మే చేయ‌గ‌ల‌డు - అభివృద్ధి కాద‌ని అంద‌రికీ అర్థ‌మైంది. తాజాగా త‌న‌దైన శైలిలో విభిన్న అంశాల‌ను మేళ‌వించి ఆయ‌న మాట్లాడే తీరులో ఎదురుదాడి డోసు కూడా ఎక్కువే. తెలంగాణ ఎన్నిక‌ల్లో అలా ఎదురుదాడి చేసిన తీరు బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ - మహబూబ్‌ నగర్‌ లో ‘మార్పుకోసం బీజేపీ’ పేరిట భారీ బహిరంగసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ - టీడీపీలు కలిసి పోయాయని అదేమీ విచిత్రమైన అంశం కాదన్నారు. అదేవిధంగా కేసీఆర్ మరో మత ఛాందసవాద పార్టీతో దోస్తీ చేయడం తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. చంద్రబాబు - కేసీఆర్‌ లు కాంగ్రెస్ గూటిపక్షులేనని ఆ విత్తనాలు అక్కడి నుండే మొలకెత్తాయని ఎద్దేవా చేశారు.

తెలంగాణ భాష - వ్యక్తుల గురించి - ఖ్యాతి గురించి ప్రస్తావిస్తూనే కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చని తీరును ఎండగట్టారు. కేసీఆర్ ఇచ్చిన పెద్ద పెద్ద హామీలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూనే ఎద్దేవా చేశారు. నాందేడ్ నుండి నేరుగా నిజామాబాద్ చేరుకున్న ప్రధాని అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణకు ఎంతో చరిత్ర ఉందని - మార్పుకోసం - ప్రగతి కోసం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందని - అమరుల ఆంకాంక్షలను ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చలేక‌పోయింద‌న్నారు. నాలుగున్నరేళ్ల పాలనను ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

వాగ్దానాలను నెరవేర్చడంలో టీఆర్‌ ఎస్ విఫలమైందని - 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన తరహాలోనే టీఆర్‌ ఎస్ కూడా ఆలోచిస్తుందని పేర్కొన్న ప్రధాని ఒకే దెబ్బకు మూడు పిట్టలు చందంగా ఇటు టీఆర్‌ ఎస్‌ ను - కాంగ్రెస్‌ ను మరో పక్క టీడీపీని కూడా ఎండగట్టారు. అభివృద్ధి చేయకుండా గెలవచ్చనే భ్రమలో టీఆర్‌ ఎస్ ఉందని చెప్పిన ప్రధాని తాము వడ్డీతో సహా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని అభివృద్ధి - తాగునీరు - సాగునీరు గురించి ప్రధానంగా ప్రస్తావించారు. మరో పక్క ప్రధాని ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం గురించి ప్రత్యేకించి ప్రస్తావించారు. ఆరు కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన విషయం ప్రస్తావిస్తూ ఒకపుడు టెలిఫోన్ కనెక్షన్ కోసం కూడా లైన్‌ లో నిల్చోవల్సి వచ్చేదని అన్నారు. మహబూబ్‌ నగర్ సభలో జోగులాంబ దేవాలయం గురించి మాట్లాడి సెంటిమెంట్‌ ను రంగరించారు. కాంగ్రెస్ - టీఆర్‌ ఎస్‌ ల తీరును డబ్ల్యుడబ్ల్యుఎఫ్‌ లో జరిగే నకిలీ పోరాటంతో పోల్చి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ప్రజల కోసం వచ్చిందని, కానీ ఇక్కడి పరిస్థితులు చూస్తే విచిత్రంగా కనబడుతున్నాయని మోడీ అన్నారు. ఎందరో యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని వారి ఆశయాలకు తూట్లు పొడుస్తూ కేసీఆర్ పాలన సాగించారని ఆరోపించారు. తెలంగాణలో ఒక కుటుంబమే కబ్జా చేసిందని దేశాన్ని నాలుగు తరాలుగా కాంగ్రెస్ కూడా కబ్జా చేసిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని దేశంలో ఎన్నో సమస్యలకు కారకులు ఎవరో నిలదీయాలని నరేంద్రమోదీ ప్రజలకు పిలుపునిచ్చారు

అయితే, మోడీ మాట‌ల గార‌డీని తెలంగాణ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. అస‌లు ఇంత‌కాలం ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వ‌లేదు. ప్ర‌త్యేక హైకోర్టు ఆల‌స్యం చేశారు. నాలుగేళ్ల‌లో దేశాన్ని దారుణంగా నాశ‌నం చేశారు.. మీ ప్ర‌భుత్వ‌మే అనేక‌సార్లు కేసీఆర్‌ను శ‌భాష్ అని అవార్డులు ఇచ్చింది. మ‌రి మీరెలా విమ‌ర్శిస్తారు కేసీఆర్ అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.