Begin typing your search above and press return to search.

సినిమాలో లాయర్, డాక్టర్, సీఎం, పీఎం కావచ్చు.. రియల్ లైఫ్ లో కాలేరబ్బా!

By:  Tupaki Desk   |   30 March 2021 8:30 AM GMT
సినిమాలో లాయర్, డాక్టర్, సీఎం, పీఎం కావచ్చు.. రియల్ లైఫ్ లో కాలేరబ్బా!
X
‘ఆలూ లేదు.. చూలు లేదు.. కాబోయే సీఎం పవన్ కళ్యాణ్’ అన్నాడట ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. ఇక ఆయన ప్రకటన చేసిందే ఆలస్యం జనసేనలో నంబర్ 2 నేత నాదెండ్ల మనోహర్ అందిపుచ్చుకున్నారు. ‘వచ్చే ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ కాబోతున్నారని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని శపథం చేసేశారు. ఇందుకోసం జనసైనికులపై భారం పెట్టారు. జనసేన కార్యకర్తలందరూ కష్టించి పనిచేస్తే ఇది పెద్ద అసాధ్యమేమీ కాదన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పటి నుంచే శ్రమించాల్సి ఉంటుందని నాదెండ్ల పిలుపునిచ్చారు. ప్రజాసమస్యల కోసం పవన్ కల్యాణ్ నిరంతరం పని చేస్తుంటారని ఆయన కొనియాడారు..’’

అంతా బాగానే ఉంది. కానీ అసలు ముచ్చటే జనసేన-బీజేపీ దగ్గర లేదని విమర్శలు వస్తున్నాయి.. ఎంత సేపు భావోద్వేగాలపై రాజకీయాలు చేయడం తప్ప క్షేత్రస్థాయిలో అటు బీజేపీకి కానీ.. ఇటు జనసేనకు కానీ బలమైన ఓటు బ్యాంకు, కార్యకర్తలు, నేతల బలం లేదన్నది అంగీకరించాల్సిన వాస్తవం. నిజం చెప్పాలంటే ‘నాగార్జున సాగర్’ లో అసలు క్యాండిడేట్ లేకపోతే.. టీఆర్ఎస్ నుంచి ఎవరూ రాకపోతే.. ఒక డాక్టర్ ను తీసుకొచ్చి బరిలోకి దింపింది బీజేపీ. తెలుగురాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గంలో చూసుకుంటే బీజేపీకి, జనసేనకు అసలు ఒక్క గట్టి నియోజకవర్గం కూడా లేదంటే అతిశయోక్తి కాదంటున్నారు. కొన్ని చోట్లల్లో తప్పితే రాష్ట్రమంతా ప్రభావం చేసేంతగా వీరి పరపతి లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

జనసేన పరిస్థితి అయితే మరీ ఘోరం అంటున్నారు. జనసేనలో అయితే పవన్.. లేదంటే నాదెండ్ల మనోహర్ తప్పితే మూడో ముఖం లేనే లేదన్న విమర్శ ఉంది. ఇక జనసేనకు బూత్ స్థాయిలో కార్యకర్తలు లేరు అన్నది అందరూ అంగీకరిస్తున్న వాస్తవం. బీజేపీ ఇప్పుడిప్పుడే ఏపీలో విస్తరించి బూత్ స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేస్తోంది. అయినా కూడా బీజేపీ వాళ్లు ‘తమ సీఎం అభ్యర్థి అని పవన్’ను ప్రకటించడం విశేషం.

బీజేపీ-జనసేన కూటమికి కలిపి ఏపీలో 3-5 శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయంటున్నారు. ఆ ఓట్లతో సీఎం సీటు కాదు కదా.. ఎమ్మెల్యే సీట్లనే గెలవడం కష్టం. ఓట్ల చీల్చేంత స్థాయి కూడా ఈ కూటమికి లేదంటున్నారు. టీడీపీ, వైసీపీల్లా క్షేత్రస్థాయిలో విస్తరించి బలంగా లేని బీజేపీ-జనసేనలు ఏకంగా వచ్చేసారి అధికారంలోకి రావడం.. పవన్ సీఎం కావడం అంటూ కంటున్న కలలు కల్లలవుతాయా? లేదా నెరవేరుతాయా? అన్నది వేచిచూడాలి.

అయినా సినిమాల్లో క్షణాల్లో లాయర్, డాక్టర్.. అవసరమైతే ‘భరత్ అనే నేను’ సినిమాలోలా ‘సీఎం’ కావచ్చు. కానీ రియల్ లైఫ్ లో అంత ఈజీగా సీఎం కాలేరబ్బా అని సెటైర్లు పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకొని ఆ దిశగా ముందుకు సాగాలని.. అప్పుడే ఆయన సీఎం కల గురించి ఆలోచించాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు.