Begin typing your search above and press return to search.

పవన్ మేకపోతు గాంభీర్యం ఇంకెన్నాళ్లు?

By:  Tupaki Desk   |   5 Jun 2018 4:41 PM GMT
పవన్ మేకపోతు గాంభీర్యం ఇంకెన్నాళ్లు?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన యాత్రల్లో పదేపదే ఒక మాట చెప్తున్నారు. ఏపీలోని అన్ని స్థానాలకు పోటీ చేస్తామని.. తాను సీఎం కావడం ఖాయమని చెప్పుకొస్తున్నారు. కానీ.. రెండు జిల్లాలు దాటి మూడో జిల్లాలోకి ఆయన యాత్ర వచ్చినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. యాత్రకు సినీ అభిమానులు - ఒక హీరోను చూడాలని కోరుకునే సాధారణ ప్రజలు తప్ప సమాజంలోని మేధావి వర్గాలు - రాజకీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకునే వర్గాల నుంచి ఆయన పట్ల ఆసక్తేమీ కనిపించడం లేదు. అంతేకాదు.. పార్టీలో చేరికలన్నవి లేనేలేవు. నిజానికి జనాల్ని - ఇతర పార్టీల్లోని నాయకులను - రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఔత్సాహికులు - ప్రముఖులను ఆకర్షించే అంతర్త లక్ష్యంతో ఈ యాత్ర చేపట్టినా ఆ లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. దీంతో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి పవన్‌కు అసలు అభ్యర్థులు దొరకడమే కష్టమన్న అభిప్రాయం అంతటా వినిపిస్తోంది.

దీంతో... నేనే సీఎం.. అన్ని స్థానాలూ మనవే అంటూ పవన్ చెబుతున్న మాటలు మేకపోతు గాంభీర్యం తప్ప ఇంకేమీ కాదన్న మాట బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇతర పార్టీల్లో టిక్కెట్ల వేటలో వెనుకబడినవారు.. అసంతృప్తులు... సొంత సామాజికవర్గానికి చెందిన నేతలు కూడా పవన్ వైపు కనీసం చూడడం లేదు.

అంతేకాదు.. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతల్లో చాలామంది రాజకీయంగా ఖాళీగా ఉన్నారు. అటు టీడీపీలోకి - ఇటు వైసీపీలోకి కూడా వెళ్లలేనివారు ప్రతి జిల్లాలో ఉన్నారు. అలా అని కాంగ్రెస్ పార్టీలో కూడా వారు ఏమాత్రంయాక్టివ్‌ గా ఉండడం లేదు. కనీసం అలాంటి రాజకీయ నిరుద్యోగులు కూడా పనవ్ వైపు కన్నెత్తి చూడడం లేదు.

'ఈ పరిస్థితులన్నీ చూశాక పవన్ పరిస్థితి వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుందన్న విషయంలో అందరిలో ఒక క్లారిటీ కనిపిస్తోంది. అప్పట్లో పవన్ అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం ఎన్నికల బరిలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి అనేక చోట్ల పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకలేదు. కానీ.. ఇప్పుడు పవన్ పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉంది. ఈయనకు కనీసం అభ్యర్థులు కూడా దొరికేలా లేరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.