Begin typing your search above and press return to search.

గుంతల రోడ్డులో ఫొటోషూట్... జనానికి చిర్రెత్తితే ఇలాగే ఉంటది

By:  Tupaki Desk   |   19 Nov 2019 4:48 AM GMT
గుంతల రోడ్డులో ఫొటోషూట్... జనానికి చిర్రెత్తితే ఇలాగే ఉంటది
X
నిజమే... రోడ్డు నిండా గుంటలు... ఆ గుంటల పక్కనే ఓ అందమైన అమ్మాయి... అదే ఓ మోడల్... అక్కడే ఫొటో షూట్. అంతా అలా చూస్తుండిపోయారు. ఈ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేసిన వారు మాత్రం అవేమీ పట్టకుండా ఫొటో షూట్ లాగించేశారు. ఆ పై ఆ ఫొటో షూట్ ను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అంతే... ఆ ఫొటో షూట్ వైరల్ కే వైరల్ అయిపోయింది. ఇదేంటీ.. ఫొటో షూట్ లలో ఇదో కొత్త రకమా? అంటే... ఫొటో షూట్ కు కొత్తే అయినా... ఇదో కొత్త తరహా నిరసన. జనానికి చిర్రెత్తితే ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా కొనసాగిన వినూత్న నిరసన. సమస్యలను ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో చేసి చూపించడానికే ఈ కొత్త తరహా ఫొటో షూట్... అదేనండీ కొత్త తరహా నిరసన.

ఇంతటి ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ నిరసన కథాకమామీషులోకి వెళితే... బెంగళూరు మహా నగరంలోని బెల్లందూర్ ప్రాంత వాసులు తమ సమస్యలను పట్టించుకోకపోవడమే కాకుండా అసలు తాము ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే అసలు తమ కంటికే ఆనకుండా తిరుగుతుంటే.. .చిర్రెత్తిపోయి ఈ వినూత్న నిరసనకు దిగారు. గ్గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరులో గుంతలమయంగా ఉన్న రోడ్లను ఊహించలేం కదా. అయితే మనం బెల్లందూర్ వెళితే మాత్రం నిండా గుంతలతో రోడ్లు దర్శనమిస్తాయట. ఈ గుంటల్లో కారు కాదు కదా... బైక్ వెళ్లాలన్నా కూడా చాలా కష్టమేనట. నడవడానికి కూడా ఇబ్బందిగానే ఉందట. దీంతో ఈ సమస్యను తీర్చాలంటూ తమ ప్రాంతం ప్రజాప్రతినిధి మహదేవపుర ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ నేత, మాజీ మంత్రి అరవింద్ లింబావలికి అక్కడి జనం లెక్కలేనన్ని వినతులు ఇచ్చారట. అయినా కూడా ఆ సమస్య... అలాగే ఉండిపోయింది.

సహనం నశించిన బెల్లందూర్ ప్రజలు నేరుగా ప్రధాని కార్యాలయానికే లేఖ రాసేశారు. ఆ లేఖను ప్రధాని కార్యాలయం కూడా పరిశీలించి స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించాలంటూ సూచించిందట. దీంతో మరింతగా చిర్రెత్తిన బెల్లందూర్ వాసులు... ఏం చేస్తే ఎమ్మెల్యే లింబావలి దిగొస్తారని ఆలోచించారట. అప్పుడే ఓ మెరుపు లాంటి ఐడియా తట్టడంతో గుంటల్లోనే మోడల్ ను నిలబెట్టేసి ఫొటో షూట్ కానిచ్చేశారట. ఈ ఫొటో షూట్ ను నేరుగా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేశారు. అంతే... సమస్య పట్టని ప్రజా ప్రతినిధిగా లింబావలిపై ముద్ర పడిపోగా... బీజేపీ అధిష్ఠానం నుంచి కూడా ఆయనకు శ్రీముఖం వచ్చే పరిస్థితి వచ్చిందట. మొత్తంగా తమదైన వినూత్న నిరసనతో ఇప్పుడు బెల్లందూర్ ప్రజలు సమస్యల పరిష్కారం పట్టని ప్రజా ప్రతినిధులకు ఇదే గుణపాఠమని చెప్పేశారన్న మాట.