Begin typing your search above and press return to search.

స‌త్య‌నాదెళ్ల‌కు ద‌క్కిన అరుదైన గౌర‌వం ఇది

By:  Tupaki Desk   |   20 April 2018 5:11 AM GMT
స‌త్య‌నాదెళ్ల‌కు ద‌క్కిన అరుదైన గౌర‌వం ఇది
X
తెలుగు బిడ్డ‌, అంత‌ర్జాతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ సీఈఓ స‌త్య‌నాదెళ్ల‌కు ద‌క్కిన గొప్ప గౌరవం ఇది. టైమ్ మ్యాగజైన్ తాజాగా ప్రచురించిన ప్రపంచంలోని వందమంది అత్యంత ప్రభావశీలురైన ప్రముఖుల జాబితాలో నలుగురు భారతీయులకు చోటు లభించింది. ఓలా సంస్థ సహ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ - బాలీవుడ్ నటి దీపికా పదుకొనె, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ జాబితాలో ఉన్నారు. టైమ్ అత్యంత ప్రభావశీలుర 15వ వార్షిక జాబితాలో చోటుదక్కిన దేశనాయకుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ - ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్ - బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తదితరులున్నారు. ఈ వందమందిలో 45 మంది 40 ఏళ్ల‌ వయసులోపు వారు. వీరిలో అతిపిన్న వయస్కురాలైన 14 ఏళ్ల‌ బాలనటి మిల్లీబాబీ కూడా ఉన్నారు.

క్రియాశీలత - నవ్యత్వం - విజయాల సాధన తదితర అంశాల ఆధారంగా అంతర్జాతీయంగా ప్రభావం చూపిన వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను ప్రభావశీలుర జాబితాలో చేరుస్తారు. ఇందులో స‌త్య‌కు కూడా స్థానం ద‌క్కింది. సత్యనాదెళ్ల భారత్‌ లో జన్మించి మైక్రోసాఫ్ట్ వంటి అతిపెద్ద అంతర్జాతీయ ఐటీ సంస్థకు సీఈవో స్థాయికి ఎదిగిన యువ సంచలనం. 2014లో ఆయన సీఈవో అయిన తరువాత మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 130 శాతం పెరిగింది. అగర్వాల్ (32) స్థాపించిన క్యాబ్ కంపెనీ ప్రపంచంలోని అతి పెద్ద ప్రయాణికుల రవాణా సంస్థల్లో ఒకటిగా పేరు పొందింది. పలు హిందీ చిత్రాలలో నటించిన దీపిక - ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ వంటి హాలీవుడ్ సినిమాలు కూడా చేశారు. దీపిక నటించిన తాజా చిత్రం పద్మావత్ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జట్టుకు అనేక విజయాలు అందించిన మేటి క్రీడాకారుడు - కెప్టెన్.