Begin typing your search above and press return to search.

ట్రంప్ దిమ్మ‌తిరిగిపోయేలా జ‌వాబిచ్చిన స‌త్య నాదెళ్ల‌

By:  Tupaki Desk   |   23 Feb 2017 4:37 AM GMT
ట్రంప్ దిమ్మ‌తిరిగిపోయేలా జ‌వాబిచ్చిన స‌త్య నాదెళ్ల‌
X
అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వలస విధానాలు - భారత్ ఎదుర్కొంటున్న హెచ్1బీ వీసాల సమస్యపై ప్రపంచ సాఫ్ట్‌ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఒకింత ఘాటుగానే స్పందించారు. ప్రస్తుతం భారత్‌ లో పర్యటిస్తున్న సత్యనాదెళ్ల సీఎన్‌ బీసీ టీవీ-18 చానెల్‌ తో మాట్లాడుతూ పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అమెరికా అంటేనే వలసదారుల దేశమని అన్నారు. సర్వజనహితం, భిన్నత్వం అనేవి అమెరికాకు గీటురాళ్ల వంటివని స‌త్య‌నాదెళ్ల‌ నొక్కిచెప్పారు. అమెరికా అనుసరించిన విజ్ఞతాయుత వలస విధానం వల్ల లబ్ధి పొందినవారిలో తానూ ఉన్నానని పేర్కొన్నారు.

ఉద్యోగాల విషయంలో అమెరికాలో అయితే అమెరికాకే పెద్దపీట...ఇండియాలో అయితే ఇండియాకే పెద్దపీట వేయడం అనేది తమ కంపెనీ విధానమని స‌త్య నాదెళ్ల‌ చెప్పారు. ప్రతిదేశంలో ఆర్థిక అవకాశాలు కల్పించడమే తమకు మార్గదర్శక సూత్రంగా ఉంటుందని అన్నారు. ఒక అమెరికా కంపెనీగా అమెరికాను చిరకాలంగా నిలబెట్టిన విలువలకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. సర్వజనహితం, భిన్నత్వం అనే దృక్కోణంలో నుంచే విధానాలు రూపొందించుకుంటామని చెప్పారు.

దేశంలో సరయిన పత్రాలు లేకుండా అక్రమంగా ఉంటున్న దాదాపు కోటీ పది లక్షల మందిని పంపించి వేయడానికి అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ ప్రణాళికల కారణంగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న దాదాపు 3 లక్షల మంది భారత్‌ కు తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరయిన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షలాది మందిని పంపించి వేయడానికి ట్రంప్ క్షేత్రస్థాయి చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఇందుకోసం ఆయన ఫెడరల్ ఇమిగ్రేషన్ చట్టాలను పకడ్బందీగా అమలు చేయడానికి వీలుగా ఆ చట్టాల పరిధిని గణనీయంగా విస్తృతపరుస్తూ కొత్త మార్గదర్శకాలూ జారీ చేశారు. ‘దేశంనుంచి పంపించి వేయాల్సిన విదేశీయులకు చట్టంనుంచి ఎలాంటి మినహాయింపులు ఉండవు’ అని హోంలాండ్ సెక్యూరిటీ విభాగం జారీ చేసిన ఓ మెమో పేర్కొంది. ‘ఏ విదేశీయుడైనా ఇమిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు నమ్మినట్లయితే అతడ్ని అరెస్టు చేసేందుకు, అదుపులోకి తీసుకునేందుకు పూర్తి అధికారాలు ఇమిగ్రేషన్ అదికారికి ఉంటాయి’అని కూడా ఆ మెమో స్పష్టం చేసింది.

అక్రమ వలసదారులను దేశంనుంచి పంపించి వేయడానికి ఇమిగ్రేషన్ చట్టాలను మరింత కఠినతరం చేస్తూ రెండు ఎన్‌ ఫోర్స్‌ మెంట్ మెమోలను హోంలాండ్ సెక్యూరిటీ విభాగం జారీ చేసింది. సరయిన పత్రాలు లేకుండా అమెరికా వెళ్లిన వారిలో మన దేశానికి చెందిన వారు దాదాపు 3 లక్షల మంది ఉంటారని అంచనా. వేగంగా బహిష్కరించే విధంగా నిబంధనలను అమలు చేసే అధికారం హోం లాండ్ సెక్యూరిటీ విభాగం మంత్రికి ఉంటుంది. అమెరికాలోకి ప్రవేశించడానికి అనుమతించని వారిని, అనుమతించదగని వ్యక్తిగా ప్రకటించడానికి ముందు రెండేళ్ల పాటు అవిచ్ఛిన్నంగా భౌతికంగా అమెరికాలో ఉండని వారిని ఈ నిబంధన కింద దేశంనుంచి పంపించి వేయవచ్చు. అయితే చిన్న పిల్లలున్న వాళ్లు, ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్న వాళ్లు, లేదా స్వదేశంలో హింస, నిర్బంధానికి గురవుతామని భయపడుతున్న వాళ్లు, చట్టబద్ధమైన ఇమిగ్రేషన్ స్టేటస్ ఉన్నట్లు తెలిపే వారు ఈ చర్యలనుంచి తప్పించుకోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/