Begin typing your search above and press return to search.

గ్రీన్ కార్డు రిజెక్ట్ తోనే స్నాప్ డీల్‌!

By:  Tupaki Desk   |   27 Sep 2017 4:34 AM GMT
గ్రీన్ కార్డు రిజెక్ట్ తోనే స్నాప్ డీల్‌!
X
ఒక‌టి పోయిందన్న బాధ‌ను చాలామంది వ్య‌క్తం చేస్తుంటారు. నిజానికి ఒక‌టి పోయిందంటే.. అంత‌కు మించింది మ‌రొక‌టి దొరుకుతుంద‌న్న ఆశావాహ దృక్ఫ‌ధం అద్భుత‌మైన ఫ‌లితాల్ని సాధిస్తుంద‌ని చెప్పాలి. ఈ రియ‌ల్ ఉదంతం వింటే.. ఆ మాట‌లో నిజం ఎంత‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఒక వ్య‌క్తికి గ్రీన్ కార్డు రాక‌పోవ‌టం అంటే అంత‌కు మించిన వైఫ‌ల్యం మ‌రొక‌టి లేద‌ని భావిస్తారు.

కానీ.. ఆ వైఫ‌ల్యాన్ని అధిగ‌మించేందుకు చేసిన ప్ర‌య‌త్నం మ‌రో భారీ విజ‌యానికి కార‌ణం అవుతుంద‌న్న నిజాన్ని టెక్ దిగ్గ‌జం మెక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య‌నాదెళ్ల వెల్ల‌డించారు. ఆయ‌న తాజా పుస్త‌కంలో ఆస‌క్తిక‌ర అంశాల‌కు కొద‌వ లేదు. త‌న‌తో పాటు గ్రీన్ కార్డు కోసం ట్రై చేసిన త‌న స‌హ‌చ‌రుడు కునాల్ బాల్ (స్నాప్ డీల్‌) కు సంబంధించిన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. భార్య కోసం తాను గ్రీన్ కార్డు వ‌దిలేస్తే.. కునాల్ బాల్‌ కు గ్రీన్ కార్డురాలేద‌న్నారు. దీంతో ఆయ‌న భార‌త్ కు వెళ్లిపోయార‌న్నారు.

త‌ర్వాతి కాలంలో అదే కునాల్ బాల్ పుణ్య‌మా అని స్నాప్ డీల్ అంకురార్ప‌ణ జ‌రిగింద‌ని చెప్పారు. కునాల్‌ కున్న హెచ్ 1 బీ వీసా గ‌డువు పూర్తి కావ‌టం.. గ్రీన్ కార్డు రాక‌పోవ‌టంతో భార‌త్‌ కు వెళ్లాల్సి వ‌చ్చింద‌న్నారు. త‌ర్వాతి కాలంలో స్నాప్ డీల్‌ ను స్థాపించిన విష‌యాన్ని స‌త్య‌నాదెళ్ల గుర్తు చేసుకున్నారు. ఇప్పుడా సంస్థ ఒక బిలియ‌న్ డాల‌ర్లకు పైగా నిక‌ర విలువ‌తో ఉంద‌న్నారు. 500 మందికి ఉపాధిని ఇస్తున్న స్నాప్ డీల్ విచిత్రంగా మైక్రోసాఫ్ట్ లాంటి జెయింట్ కంపెనీ భ‌విష్య‌త్తులో కీల‌క భూమిక పోషించ‌వ‌చ్చ‌ని చెప్పుకొచ్చారు.

ఇక‌.. టీనేజ్ లో ఉన్న‌ప్పుడు త‌న క‌ల గురించి స‌త్య‌ నాదెళ్ల ప్ర‌స్తావించారు. ప్ల‌స్ టూ చ‌దివే స‌మ‌యంలో ఎవ‌రైనా నీ క‌లేంట‌ని అడిగితే.. చిన్న కాలేజీలో చ‌ద‌వాల‌ని.. హైద‌రాబాద్ త‌ర‌ఫున క్రికెట్ ఆడాల‌ని.. ఒక బ్యాంకులో ఉద్యోగిగా ప‌ని చేయాల‌న్న‌దే త‌న క‌ల‌గా చెప్పాన‌న్నారు. త‌న మాట‌ల్ని విని త‌న త‌ల్లి సంతోషిస్తే.. త‌న తండ్రి మాత్రం హైద‌రాబాద్ దాటి రాణించాల‌ని కోరుకున్నార‌ని గుర్తు చేసుకున్నారు. తాను ఇంజ‌నీరింగ్ చ‌దువుతాన‌ని.. ఇలా అమెరికాకు వ‌స్తాన‌ని అస్స‌లు ఊహించ‌లేద‌న్నారు.

తాను చ‌దివిన హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్లో చ‌దివిన ఇత‌ర ప్ర‌ముఖుల గురించి స‌త్య‌నాదెళ్ల త‌న పుస్త‌కంలో ప్ర‌స్తావించారు. అడోబ్ సీఈవో శంత‌ను నారాయ‌ణ్‌.. మాస్ట‌ర్ కార్డ్ సీఈవో అజ‌య్ సింగ్ బంగా.. కావియ‌మ్ నెట్ వ‌ర్క్స్ అధిప‌తి స‌య్య‌ద్ బి. అలీ.. ఫైర్ ఫాక్స్ ఫైనాన్షియ‌ల్ వ్య‌వ‌స్థాప‌కుడు ప్రేమ్ వ‌త్స‌తో పాటు పార్ల‌మెంటు నేత‌లు.. సినిమా తారలు..ఆట‌గాళ్లు.. ర‌చ‌యిత‌లు ఇలా.. చాలామందే తమ స్కూల్లో చ‌దివిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు.