Begin typing your search above and press return to search.

రాష్ట్రం మంచి చేతుల్లో ఉంది... జగన్ కి అరుదైన ఆశీర్వాదం...?

By:  Tupaki Desk   |   20 Jan 2022 9:02 AM GMT
రాష్ట్రం మంచి చేతుల్లో ఉంది... జగన్ కి అరుదైన ఆశీర్వాదం...?
X
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన అంటేనే కొన్ని సెక్షన్లలో వ్యతిరేక‌త ఉందని చెబుతారు. ఇక కొన్ని రంగాల్లో కూడా జగన్ ముఖ్యమంత్రి అని భావించడంలేదని వైసీపీ మంత్రులు సెటైరికల్ గా తరచూ విమర్శలు చేస్తూంటారు. అలాంటి టాలీవుడ్ రంగం నుంచి వెటరన్ ఆర్టిస్టు, మాజీ ఎంపీ కూడా అయిన కైకాల సత్యనారాయణ జగన్ కి తాజాగా లేఖ రాశారు. అంతే కాదు, అందులో జగన్ గురించి కొన్ని మంచి మాటలు చెప్పారు. ఎన్టీయార్ కాలం నాటివారు. టీడీపీ తరఫున ఒకనాడు ఎంపీ అయిన వారు, బలమైన సామాజికవర్గానికి చెందిన వారు, అద్భుతమైన నటుడు అయిన సత్యనారాయణ జగన్ గురించి మంచిగా చెప్పడం ఇపుడు చర్చనీయాశం అవుతోంది.

ఇంతకీ సత్యనారాయణ ఏమన్నారు, జగన్ కి ఎందుకు లేఖ రాశారు అంటే కొద్ది నెలల ముందుకు వెళ్లాలి. గత ఏడాది నవంబర్ లో సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత చేసింది. ఆయన హైదరాబాద్ లోని ఒక కార్పోరేట్ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం తరఫున జగన్ ముందుకు వచ్చి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు, సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని చెబుతూ ఆయన వైద్య ఖర్చులను ప్రభుత్వమే మొత్తం భరిస్తుంది అని హామీ ఇచ్చారు. ఆ విధంగా ఆయనకు అవసరమైన వైద్య సదుపాయాలా మీద కూడా ఆరా తీశారు.

మొత్తానికి ఎప్పటికపుడు జగన్ సత్యనారాయణ హెల్త్ అప్ డేట్స్ గురించి వాకబు చేయడమే తానున్నాను అని గట్టి భరోసా ఇచ్చారు. దీంతో ఇపుడు పూర్తి ఆరోగ్యవంతుడై ఇంటికి వచ్చిన సత్యనారాయణ జగన్ కి లేఖ రాశారు. అందులో నా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించిన మీకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. మీరు హామీ ఇచ్చినట్లుగానే ఉన్నతాధికారులు ఆసుపత్రి వద్దకు వచ్చి అన్ని రకాలుగా చూసుకున్నారని సత్యనారాయణ పేర్కొన్నారు. కష్ట సమయంలో మీరు అందించిన సాయంతో నా కుటుంబం మొత్తానికి ఎంతో శక్తి వచ్చింది అని సత్యనారాయణ అన్నారు.

ఇక కళాకారుల పట్ల మీకు ఉన్న అభిమానానికి ఇది నిదర్శనం అని కూడా ఆయన పేర్కొన్నారు. ఇది నా ఒక్కడి పట్ల కాదు, ప్రజల పట్ల మీకున్న శ్రద్ధకు నిదర్శనం అని సత్యనారాయణ చెప్పడం విశేషం. రాష్ట్రం మంచి చేతుల్లో ఉందని తనకు అర్ధమైందని ఆ వెటరన్ నటుడు అనడం నిజంగా ఈ సమయంలో వైసీపీకి జగన్ కి బూస్టింగ్ లాంటిదే. చూడాలి మరి టాలీవుడ్ లో ఒక సీనియర్ నటుడి నుంచే ఇలాంటి ప్రశంస జగన్ కి రావడం వల్ల ఇరు వైపులా ఉన్న గ్యాప్ ఏమైనా తగ్గుతుందేమో.