Begin typing your search above and press return to search.

ఒకేరోజు 81 మందికి మరణశిక్ష

By:  Tupaki Desk   |   13 March 2022 5:30 AM GMT
ఒకేరోజు 81  మందికి మరణశిక్ష
X
గల్ఫ్ దేశాల్లో కీలకమైన సౌదీ అరేబియాలో ఒకేరోజు 81 మందికి మరణశిక్ష అమలైంది. వీరిలో సౌదీ అరేబియా వాళ్ళు 73 మంది, యెమెన్లు ఏడుగురు, సిరియన్ ఒకళ్ళున్నారు. వీళ్ళందరికీ శనివారం ఒకేసారి సామూహిక మరణశిక్షను విధించటం దేశచరిత్రలో మొదటిసారిగా రికార్డయ్యింది. గల్ఫ్ రాజ్య ఆధునిక చరిత్రలో ఇదే అతిపెద్ద సామూహిక మరణశిక్ష అమలుగా చెప్పాలి.

సౌదీలో హత్యలు, ఉగ్రవాదం లాంటి నేరాలకు పాల్పడినందుకు వీళ్ళందరికీ మరణశిక్ష విధించి అమలు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సౌదీ ప్రెస్ ఏజెన్సీ శనివారం ఈ విషయాన్ని ప్రకటించింది. అంటే ఇతర మీడియాలేవీ మరణశిక్షను అమలుచేసిన విషయాన్ని కూడా ప్రకటించే అవకాశం లేకపోవటం విచిత్రమే. మరణశిక్ష అమలైన వాళ్ళల్లో ఆల్ ఖైందా, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, యెమన్లోని హౌతి తిరుగుబాటు దళాలకు మద్దతుదారులున్నట్లు ఏజెన్సీ చెప్పింది.

అయితే మరణశిక్షను ఎక్కడ, ఎవరు అమలుచేశారనే విషయం మాత్రం ఎవరు ప్రకటించలేదు. అంటే మరణశిక్ష అమలును కూడా అంత గోప్యంగా ఉంచారు. 1979లో మక్కాలోని దివ్యమసీదును స్వాధీనం చేసుకునేందుకు కొందరు ఉగ్రవాదులు ప్రయత్నంచేశారు. హఠాత్తుగా మసీదుపై దాడుచేశారు. అయితే అప్పట్లో ఆ దాడిని పోలీసులు దిగ్విజయంగా తిప్పికొట్టారు. అప్పట్లో ఆ ఘటన ప్రపంచంలో పెద్ద సంచలనమైంది.

ఆ ఘటనలో ప్రభుత్వం కొందరిని అదుపులోకి తీసుకున్నది. తర్వాత విచారణ జరిగి దోషులుగా తేలిన 63మందికి మరణశిక్షను విధించింది. అప్పట్లో ఆ మరణశిక్షను కూడా ఒకేసారి అమలుచేశారు. 1979 తర్వాత మళ్ళీ అంతకన్నా ఎక్కువమందికి మరణశిక్షను ఒకేసారి అమలుచేయటం ఇదే మొదటిసారి.

గల్ఫ్ దేశాల్లో విచారణలు ఎంత స్పీడుగా జరుగుతాయో, శిక్షలు ఎంత దారుణంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. మామూలు జనాలైనా, రాజకుటుంబమైనా విచారణలు, శిక్షలు దాదాపు ఒకేలాగ అమలవుతాయి. రాజకుంటుంబంలోని వాళ్ళకు కూడా కఠినమైన శిక్షలు విధించిన ఘటనలున్నాయి. ఏదేమైనా ఒకేసారి 81 మందికి మరణశిక్షలు అమలుచేయటం సంచలనమనే చెప్పాలి.