Begin typing your search above and press return to search.

సౌదీ మహిళలు ఓటేశారు

By:  Tupaki Desk   |   13 Dec 2015 9:37 AM GMT
సౌదీ మహిళలు ఓటేశారు
X
సౌదీ అరేబియాలో చారిత్రాత్మక ఘటన చోటు చేసుకుంది. తొలిసారి సౌదీ అరేబియా మహిళలు ఎన్నికల్లో ఓటేసే భాగ్యానికి నోచుకున్నారు. అంతేకాదు.. ఎన్నికల బరిలో నిలిచారు కూడా. మహిళలు డ్రైవింగ్ చేయకూడదు.. షాపింగ్ కు సైతం భర్త లేదంటే సంరక్షకుడితోనే వెళ్లటం.. ముఖం నుంచి కాలి వరకూ నిండుగా బురఖా దుస్తులతో కనిపించటం.. సంరక్షకుడి అనుమతి లేకుండా ప్రయాణం.. పరిచయం లేని పురుషులతో కలిసి తిరగటం ఇలా.. ఒకటి కాదు రెండు కాదు.. సవాలక్ష ఆంక్షలుండే సౌదీ అరేబియా దేశ మహిళలు తొలిసారి ఓటుహక్కు కల్పించారు.

పాలనలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు ఓటేసే అవకాశంతో పాటు.. పోటీ చేసే అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు. వాస్తవానికి సౌదీలో ఎన్నికలు నిర్వహించటమే అరుదు. 1965 నుంచి 2005 మధ్య కాలంలో ఎన్నికలే నిర్వహించలేదు. ఎన్నికలు నిర్వహించాలని అడిగిన వారూ లేరు. దేశ చరిత్రలో ఇప్పటివరకూ మూడుసార్లు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు.

తాజాగా నిర్వహించిన పోలింగ్ లోమహిళలకు ఓటేసే అద్భుత అవకాశాన్ని కల్పించటంపై ఆ దేశ మహిళలు విపరీతమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మహిళలకు ఇచ్చినప్పటికీ.. వారు సొంతంగా ప్రచారం చేసుకునే వెసులుబాటు ఇవ్వలేదు.సంరక్షకుడి తోడుగా వెళ్లి ప్రచారం చేయాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో 978 మంది మహిళలు పోటీ చేసినప్పటికీ.. గెలుస్తామన్న నమ్మకం ఏ ఒక్కరూ వ్యక్తం చేయటం లేదు. పురుషుడితో పోలిస్తే.. మహిళను మనిషి లెక్కలోకి వేసుకొని చోట.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వటమే.. ఎలక్షన్ లో గెలిచినంత గొప్పగా భావించటం తప్పేం కాదేమో.