Begin typing your search above and press return to search.

చైన్నై ఎయిర్ పోర్ట్ లో సౌదీ ఎయిర్ లైన్స్ షాక్‌

By:  Tupaki Desk   |   8 Aug 2017 6:53 AM GMT
చైన్నై ఎయిర్ పోర్ట్ లో సౌదీ ఎయిర్ లైన్స్ షాక్‌
X
చుట్టూ నీళ్లు ఉంటాయి. కానీ.. చుక్క నీళ్లు తాగే ప‌రిస్థితి ఉండ‌దు. కంటి ముందు న‌గ‌రం క‌నిపిస్తున్నా.. విమానం దిగ‌లేని దారుణ ప‌రిస్థితి ఎదురైతే ఎలా ఉంటుంది? స‌రిగ్గా అలాంటి ప‌రిస్థితే ఎదురైంది సౌదీ అరేబియన్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్ర‌యాణించే ప్ర‌యాణికుల‌కు.

చెన్నై ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ఉదంతం మొత్తం వింటే.. హైజాక్ గురైన ప్ర‌యాణికుల‌కు.. వీరికి పెద్ద తేడా లేద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. దాదాపు 16 గంట‌ల‌కు పైనే ప్ర‌త్య‌క్ష న‌ర‌కాన్ని అనుభ‌వించిన ఈ వైనం గురించి వింటే.. సౌదీ అరేబియ‌న్ ఎయిర్ లైన్స్ అంటే ఒళ్లు మండిపోవ‌టం ఖాయం.

కేర‌ళ‌లోనికొచ్చి మీదుగా రియాద్‌ కు వెళ్లాల్సిన సౌదీ అరేబియ‌న్ ఎయిర్ లైన్స్ విమానం ఆదివారం ఉద‌యం 292 ప్ర‌యాణికుల‌తో చెన్నై నుంచి బ‌య‌లుదేరింది. షెడ్యూల్ ప్రకారం బ‌య‌లుదేరిన ఈ విమానం కొచ్చికి చేరువ అవుతున్న వేళ‌లో తీవ్ర‌మైన సుడిగాలులు వీయ‌టంతో సాయంత్రం చెన్నైకి తీసుకొచ్చారు. ప్ర‌యాణికుల్ని విమానంలోనే ఉంచేశారు.

రాత్రి 8 గంట‌లకు కొచ్చి కి బ‌య‌లుదేరొచ్చ‌ని అనుకున్నారు. అంత‌లోనే త‌మ డ్యూటీ అయిపోయింద‌ని పైలెట్‌.. కో పైలెట్ వెళ్లిపోయారు. పైలెట్ల‌ను తీసుకొస్తున్నాం.. రాత్రి 11 గంట‌ల‌కు విమానం బ‌య‌లుదేరుతుంద‌ని చెప్పిన ఎయిర్ హోస్ట‌స్ గంట.. గంటా చొప్పున టైం పొడిగించారే కానీ విమానం బ‌య‌లుదేర‌లేదు.

త‌మ‌ను విమానం నుంచి దించేస్తే.. ఏవో పాట్లు ప‌డ‌తామ‌ని ప్ర‌యాణికులు ఎంత చెప్పినా.. సిబ్బంది మాత్రం ఒప్పుకోలేదు. చెకింగ్‌కొచ్చిలో జ‌ర‌గాల్సి ఉన్నందున విమానం దిగ‌టానికి వీల్లేద‌ని తేల్చారు. ఆక‌లితో ఉన్నామంటూ ప్ర‌యాణికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టంతో ఫుడ్ పెట్టారు. అలా.. గంట‌లు గంట‌లు గ‌డిచి సోమ‌వారం ఉద‌యం ఎనిమిద‌న్న‌ర గంట‌ల‌కు వేరే విమానానికి చెందిన పైలెట్‌.. కో పైలెట్ వ‌చ్చిన త‌ర్వాత విమానం బ‌య‌లుదేరింది. ప‌ద‌హారు గంట‌ల పాటు విమానంలోనే ఉంచేసి చుక్క‌లు చూపించిన ఎయిర్ లైన్స్ మీద ప్ర‌యాణికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.