Begin typing your search above and press return to search.

సౌదీ దౌత్యవేత్త ఇంట్లో మరీ అంత దారుణమా?

By:  Tupaki Desk   |   9 Sep 2015 4:33 AM GMT
సౌదీ దౌత్యవేత్త ఇంట్లో మరీ అంత దారుణమా?
X
సౌదీ అరేబియాలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. అలాంటి వారు ఇండియాలో ఉంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న వైనం గురించి తాజాగా బయటకు వచ్చి సంచలనం సృష్టిస్తోంది.

డిల్లీలోని సౌదీ అరేబియా దౌత్యవేత్త ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు నేపాలీలపై సాగుతున్న అత్యాచారకాండ బయటకు వచ్చి కలకలం రేపుతోంది. నాటకీయంగా బయటకొచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు ఏమవుతుందన్నది పెద్దప్రశ్నగా మారింది.

పని నిమిత్తం నేపాల్ కు చెందిన ఇద్దరు మహిళలు సౌదీ కి వెళ్లారు. అక్కడ ఓ హోటల్ లో పని చేసిన వారు.. తర్వాత ఢిల్లీలోని సౌదీ దౌత్యవేత్త ఇంటికి బదిలీ చేశారు. వారు ఢిల్లీకి వచ్చిన తర్వాత నుంచి నరకం చవి చూస్తున్నారు. వారికి తిండి పెట్టకుండా వారిపై నిత్యం అత్యాచారం చేస్తున్నారు.

ఈ ఇంటి నుంచి పారిపోయేందుకు పలుమార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అదే సమయంలో ఆ ఇంట్లో పని చేయటానికి ఒక భారతీయురాలు చేరటం.. అక్కడి పరిస్థితి చూసి భయపడి పారిపోయింది. సౌదీ దౌత్యవేత్త నివాసంలో జరుగుతున్న ఆరాచకం గురించి ఢిల్లీలోని ఒక స్వచ్ఛంద సంస్థకు వివరాలు అందించటం.. వారు ఇంటికి వెళ్లి తాము చూసిన విషయాల్ని ఢిల్లీ పోలీసులకు చెప్పటంతో సీన్ లోకి పోలీసులు ఎంటర్ అయ్యారు.

ఎట్టకేలకు సౌదీ దౌత్యవేత్త నివాసంలోని నేపాలీ యువతుల్ని బయటకు తీసుకురాగలిగారు. అయితే.. అత్యాచారం చేసింది సౌదీ దౌత్యవేత్తా? లేక.. ఆ ఇంట్లోని వారా? లాంటి ప్రశ్నలకు సమాధానం లభించాల్సి వస్తోంది. అయితే.. ఈ వ్యవహారం మూడు దేశాలకు చెందింది కావటంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు సౌదీ దౌత్యవేత్తకు అత్యాచారంతో సంబంధం ఉందని భావిస్తున్నారు. పోలీసులు దౌత్యవేత్తపై అత్యాచార కేసును నమోదు చేసినట్లుగా చెబుతున్నారు

నేరం జరిగింది భారత్ లో అయితే.. నేరస్తుడు సౌదీ వాసులు కావటం.. బాధితులు నేపాలీలు కావటంతో.. ఈ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. చట్టాల్ని కఠినంగా అమలు చేసే సౌదీలో.. అత్యాచారం లాంటి దారుణాల్ని ఆ దేశీయులు చేయటంపై భారత్ ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో చూడాలి.