Begin typing your search above and press return to search.

ట్రంప్ గెలిస్తే అమెరికాలో ఉండనంటున్నాడు

By:  Tupaki Desk   |   24 Sep 2016 5:57 AM GMT
ట్రంప్ గెలిస్తే అమెరికాలో ఉండనంటున్నాడు
X
ఈ స్టేట్ మెంట్ విన్న వెంటనే 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ ముచ్చట గుర్తుకు రాక తప్పదు. ట్రంప్ తో మోడీని పోల్చటం సరికాకున్నా.. ఈ ప్రకటన విషయంలోకి వచ్చేసరికి మాత్రం మోడీ ప్రస్తావన తీసుకురావాల్సిందే. మోడీ ప్రధాని అయితే ఏదేదో జరుగుతుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. కొందరు మేధావులైతే.. విడి రోజుల్లో ఏ విషయం మీదా స్పందించని వారు సైతం భారీగా రియాక్ట్ అయి.. మోడీ లాంటోళ్లు ప్రధానమంత్రి పదవికి అనర్హులంటూ భారీగానే ప్రచారం చేశారు.

తాజాగా ఇలాంటి పరిస్థితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విషయంలోనూ ఎదురవుతోంది. తాజాగా పులిట్జర్ అవార్డు గ్రహీత.. చరిత్రకారుడు.. రచయిత సాల్ ఫ్రీడ్ లాండర్ సంచలన ప్రకటన చేశారు. ట్రంప్ కానీ అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే మాత్రం తాను అమెరికాలో ఉండనని.. దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతానని వ్యాఖ్యానించారు. ట్రంప్ మీదున్న కోపాన్ని అక్కడితో ఆపని ఆయన.. అతనో ప్రమాదకర పిచ్చోడిగా అభివర్ణించటం గమనార్హం. ఇంత ఆందోళన ఎందుకన్న విషయాన్ని అడగకనే చెప్పేసిన సాల్ ఫ్రీడ్ లాండర్.. ‘‘అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’’ అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు.

ఓ పక్క ట్రంప్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన ఆయన.. మరోవైపు డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పైనా విమర్శలు సంధించారు. ట్రంప్ కు మద్దతు పెరగటానికి కారణంగా హిల్లరీ వైఖరేనని ఆయన మండిపడ్డారు. తన ఆదాయపన్ను వివరాలు ప్రకటించని ట్రంప్ ను చాలామంది నిజాయితీపరుడిగా నమ్మతున్నారని.. అదే సమయంలో హిల్లరీ వ్యవహారానికి వస్తే.. ఆమె అన్నివిషయాలు బయటపెట్టటం లేదన్నట్లుగా ఎక్కువ మంది నమ్ముతున్న విసయాన్ని చెప్పుకొచ్చారు. ట్రంప్ మీద ఉన్న సానుకూలత కంటే హిల్లరీ మీదున్న వ్యతిరేకతపై సాల్ ఫ్రీట్ లాండర్ మాటల్లో వినిపించటం గమనార్హం.