Begin typing your search above and press return to search.

వజ్రాల వ్యాపారి తన కొడుక్కి పెట్టిన పరీక్ష

By:  Tupaki Desk   |   23 July 2016 4:28 AM GMT
వజ్రాల వ్యాపారి తన కొడుక్కి పెట్టిన పరీక్ష
X
బిచ్చగాడు సినిమా చూశారా? తల్లి ఆరోగ్యం బాగుకావాలన్న లక్ష్యంతో ఒక స్వామీజీ మాట మీద నమ్మకం ఉంచిన ఒక బిలీయనీర్ తనకున్నసంపద మొత్తాన్ని వదిలేసి.. తన పేరు ప్రఖ్యాతుల్ని ఎవరికి చెప్పకుండా బిచ్చగాడిగా వ్యవహరించటం.. దాన్నో వ్రతంలా చేయటం చూశాం. ఈ సినిమా చివర్లో తాను చదివిన ఒక రియల్ స్టోరీ ఆధారంగానే తానీ సినిమా తీసినట్లుగా ఆ చిత్రదర్శకుడు చెప్పాడు.

తాజాగా అలాంటి రియల్ స్టోరీనే ఇది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు ఇచ్చే బోనస్ లలో ఖరీదైన విల్లాలు.. కార్లు.. లాంటి భారీ బహుమతులతో వార్తల్లో నిలుస్తుంటారు గుజరాత్ వజ్రాల వ్యాపారి సావ్‌ జీ ఢోలకియా. అలాంటి ఆయన తన 21 ఏళ్ల ముద్దుల కొడుకు ద్రావ్యకు ఓ వెరైటీ టెస్ట్ పెట్టారు. ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీల్ లైఫ్ లో కనిపించే మాదిరి రియల్ గా కొడుక్కి పెట్టిన పరీక్షకు సంబంధించిన వివరాలు ఇప్పుడు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అమెరికాలో ఎంబీఏ చదువుకుంటున్న ద్రావ్య సెలవులకు ఇండియాకు వచ్చాడు. ఈ సందర్భంగా తన కొడుక్కి పెద్ద పరీక్షనే పెట్టారు ఆ వజ్రాల వ్యాపారి.

సామాన్యుల జీవితాలు ఎలా ఉంటాయి? సంపాదన అన్నది ఎంత కష్టంతో కూడుకున్నది.. ఉద్యోగం సాధించాలంటే ఎంత శ్రమపడాలి? లాంటి అంశాలు తన కొడుక్కి అనుభవంలోకి రావాలని అనుకోవటంతో పాటు.. సగటు మనిషి జీవితం ఎలా ఉంటుందో తెలియజేయాలని అనుకున్నాడు. అంతే.. కొడుకును పిలిచి టెస్ట్ గురించి చెప్పేశాడు. నెల రోజులు ఇంటి ముఖం చూడకుండా కష్టపడి తనకు తానుగా సొంతంగా బతకాలని చెప్పాడు. ఇందుకోసం సినిమాల్లో మాదిరే సదరు వజ్రాల వ్యాపారి కొడుక్కి కొన్ని షరతులు విధించారు కూడా.

ఈ షరతులు చూస్తే.. నెల రోజుల వ్యవధిలో మూడు జతల బట్టలు.. రూ.7వేలు మాత్రమే ఇస్తానని.. తానిచ్చిన డబ్బును అత్యవసర పరిస్థితుల్లో మాత్రం వాడుకోవాలని చెప్పారు. ఫోన్ వాడకూడదని.. తన పేరును ఎక్కడా వాడుకోకూడదంటూ ఆ తండ్రి స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన పరీక్షకు ద్రావ్య ఓకే చెప్పారు. నెల రోజుల వ్యవధిలో రకరకాల పనులు చేసిన ఆ కుర్రాడు మొత్తంగా రూ.4వేలు సంపాదించాడు. ఈ సందర్భంగా అతడు చాలానే కష్టాలు పడ్డాడు. సామాన్యుడి జీవితం ఇంత కష్టంగా ఉంటుందా? అన్న విషయాన్నిఅర్థం చేసుకోవటంతోపాటు.. డబ్బు సంపాదించటం ఎంత కష్టమన్నది తనకు తెలిసిందని చెప్పుకొచ్చాడు.

తండ్రి విధించిన పరీక్షలో భాగంగా తాను కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసిన తర్వాత మొదటి రోజు ఎంత తిరిగినా ఉద్యోగం దొరకలేదని.. దాదాపు 60 చోట్లకు వెళ్లినా నో అనే చెప్పారన్నారు. చివరకు ఒక బేకరీలో పని చేశానని.. తర్వాత కాల్ సెంటర్.. చెప్పుల దుకాణం.. మెక్ డోనాల్డ్ అవుట్ లెట్ లలో పని చేసిన అతగాడికి ఉద్యోగం సంపాదించటం ఎంత కష్టమన్న విషయం తెలిసిందట.

తాను సంపాదించిన దాన్లో రూ.40 భోజనం కోసం ఖర్చు చేసేవాడినని.. లాడ్జికి రోజుకు రూ.250 ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చాడు. జీవితం అంటే ఏమిటో.. నెల వ్యవధిలోనే ద్రావ్యకు ఎంత అర్థం కావాలో అంత అర్థమైన పరిస్థితి. కొడుకు పడిన కష్టం గురించి రూ.6వేల కోట్ల ఆస్తిపరుడైన సదరు వజ్రాల వ్యాపారి స్పందించాడు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు యూనివర్సిటీ పాఠాల్లో ఉండవని.. తనకొడుక్కి సామాన్యుల కష్టాలు ఎలా ఉంటాయో తెలియజేయాలని తాను భావించినట్లుగా చెప్పారు. అనుభవానికి మించిన పాఠం మరేదీ ఉండదన్న సావ్ జీ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేయటంతో పాటు.. పలువురిని ఆకర్షిస్తున్నాయి. రీల్ కథ లాంటి ముచ్చట రియల్ గా జరిగిందంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు.