Begin typing your search above and press return to search.

ఈ ఏటా... బెంగ‌ళూరులో అవే వేధింపులా?

By:  Tupaki Desk   |   1 Jan 2018 1:28 PM GMT
ఈ ఏటా... బెంగ‌ళూరులో అవే వేధింపులా?
X
న్యూ ఇయ‌ర్ వేడ‌క‌లంటే ఇప్పుడు గుర్తుకు వ‌చ్చేది బెంగ‌ళూరే. క‌ర్ణాట‌క రాజ‌ధానిగానే కాకుండా ఐటీ కేపిట‌ల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఈ న‌గ‌రంలో నిరుడు కొత్త సంవ‌త్స‌రాది వేడుక‌ల సంద‌ర్భంగా చోటుచేసుకున్న కీచ‌క ప‌ర్వం నిజంగా ఎప్ప‌టికీ మ‌రిచిపోలేనిదే. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా స్నేహితుల‌తో సంతోషంగా వేడుక‌లు చేసుకునేందుకు బ‌య‌ట‌కు వ‌చ్చిన యువతుల‌పై కొంద‌రు యువ‌కులు సామూహికంగా లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌న్న వార్త షాకింగ్ గా మారింది. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో ఇదేం పోయే కాలం.. ఈ త‌ర‌హా వేధింపుల‌ను నివారించ‌లేకపోతే... అధికారంలో కొన‌సాగడం ఎందుకు అంటూ క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌పై విమ‌ర్శ‌ల జ‌డివాన కురిసింది.

విమ‌ర్శ‌లకు జ‌డిసిన ప్ర‌భుత్వం నాటి ఘ‌ట‌న‌పై సుదీర్ఘ ద‌ర్యాప్తే నిర్వ‌హించింది. అయితే ఆ ఘ‌ట‌న‌లో వేధింపుల మాటపై భిన్న వాద‌న‌లు వినిపించాయి. అయితే నిరుటి దుర్ఘ‌ట‌న‌ల‌ను దృష్టిలో పెట్టుకుని నిన్న‌టి న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున పోలీసు బ‌ల‌గాల‌ను మోహ‌రించింది. ప్ర‌త్యేకించి న‌గ‌రంలోని బిగ్రేడ్‌ - ఎంజీ రోడ్డు - చర్చి స్ట్రీట్‌ లలో పెద్ద ఎత్తున పోలీసులను మొహరించింది. ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసింది. డ్రోన్‌ కెమెరాలు - మఫ్టీ పోలీసులతోనూ నిఘా పెట్టింది. అయితే ఇంత భ‌ద్ర‌త ఏర్పాటు చేసినా... కీచ‌కులకు అడ్డుక‌ట్ట ప‌డ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. నిన్న రాత్రి జ‌రిగిన వేడుక‌ల్లో నుంచి ఓ యువ‌తి ఏడ్చుకుంటూ వెళ్లిన దృశ్యాలు ఇప్పుడు పెద్ద క‌ల‌క‌ల‌మే రేపుతున్నాయి.

లైంగిక వేధింపుల కార‌ణంగానే స‌ద‌రు యువ‌తి ఏడ్చుకుంటూ బ‌య‌ట‌కు వెళ్లిపోయింద‌ని కూడా ఇప్ప‌టికే పెద్ద ఎత్తున వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నిరుడు ఎక్క‌డైతే కీచ‌క ప‌ర్వం జ‌రిగిందో... ఈ ఏడాది కూడా స‌రిగ్గా అక్క‌డి నుంచే ఆ యువ‌తి ఏడ్చుకుంటూ బ‌య‌ట‌కు వెళ్ల‌డం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు మ‌రో వాద‌న వినిపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని, కేసు నమోదు కాలేదని పోలీసులు చెబుతున్నారు. సీసీటీవీ దృశ్యాల్లో ఎక్కడా అభ్యంతకర సన్నివేశాలు రికార్డు కాలేదని వారు పేర్కొంటుండ‌టం గ‌మ‌నార్హం. మొత్తంగా నిరుటి ఘ‌ట‌న‌ను మ‌రువ‌క ముందే... బెంగ‌ళూరు న్యూ ఇయ‌ర్ వేడుక‌లు ఈ ఏడాది కూడా వార్తల్లో నిలిచాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.