Begin typing your search above and press return to search.

ఛార్జీల వడ్డింపు ‘మోడీ’ పుణ్యమేనట

By:  Tupaki Desk   |   9 March 2017 4:11 AM GMT
ఛార్జీల వడ్డింపు ‘మోడీ’ పుణ్యమేనట
X
డబ్బులు మీవే. అందులోనూ.. పన్ను కట్టి మరీ బ్యాంకులో దాచుకున్నా.. అవసరానికి బయటకు తీసినా ఛార్జీల వడ్డన ఏ మేరకు ఉంటుందన్న విషయంపై ప్రైవేటు బ్యాంకులతో పాటు.. ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్ బీఐ సైతం ప్రకటనలు చేయటంపై సగటుజీవి తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. బ్యాంకు వెళ్లి.. ఏ పని చేసినా.. చార్జీల బాదుడుతో జేబులు గుల్ల చేయటంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఎందుకు.. బ్యాంకు ముందు నుంచి రోజుకు రెండుసార్లకు మించి తిరిగినా ఛార్జీలు వేసేస్తే సరిపోతుంది కదా అంటూ ఎటకారం కూడా చేసేసుకుంటున్నారు.

బ్యాంకులు పెంచిన ఛార్జీలపై ఇప్పటివరకూ ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తంచేయని ప్రైవేటు బ్యాంకులకు భిన్నంగా.. ఈ మధ్యనే తమ వడ్డింపుల వ్యవహారంతో జనాగ్రహానికి గురవుతున్న ఎస్ బీఐ.. ఛార్జీల బాదుడు అవసరం ఎందుకు వచ్చిందన్న విషయంపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మోడీ మాష్టారు తరచూ గొప్పలు చెప్పుకునే జన్ ధన్ ఖాతాల నిర్వహణ భారం అంతకంతకూ పెరిగిపోతోందని.. దీన్ని బ్యాంకు భరించాలంటే ఆ మాత్రం ఛార్జీలు వేయక తప్పదన్న విషయాన్ని చెప్పేశారు.

మామూలు ఖాతాలు మినిమం బ్యాలెన్స్ లేకుంటే ఛార్జీల పోటు వేసే తమ బ్యాంకు.. జన్ ధన్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లను ఉంచాల్సిన అవసరం లేదని.. వారెవరూ ఛార్జీల పరిధిలోకి రారన్న విషయాన్ని స్పష్టం చేశారు ఎస్ బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య. తాము ఇప్పటికే ప్రకటించిన ఛార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. అయితే.. తమ బాదుడుపై వివిధ రాజకీయ పార్టీలు మొదలు.. సామాన్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నా.. ఆ ప్రభావం ఏదీ ఆమె నోటి నుంచి వచ్చిన మాటల్లో వినిపించకపోవటం గమనార్హం.

మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. జన్ ధన్ అకౌంట్లు కానీయండి.. మిగిలిన ఖాతాలు కానివ్వండి.. తమపై 11 కోట్ల అకౌంట్ల భారీ భారం తమపై ఉందని.. వాటిని నిర్వహించాలంటే కొన్ని ఛార్జీలు తప్పవని.. అందుకే.. ఆ భారాన్ని తగ్గించుకోవటానికి తామెన్నోమార్గాల్ని అన్వేషిస్తున్నామని.. అందులో భాగంగానేఛార్జీల బాదుడు తప్పలేదని ప్రకటించారు.

మిగిలిన బ్యాంకులతో పోలిస్తే.. తమ బ్యాంకువిధించే ఛార్జీలు తక్కువన్న మాటను చెప్పుకున్న ఆమె.. తమ విశ్లేషణలో తమ బ్యాంకుల్లో అత్యధికం నెలవారీ రూ.5వేలకు పైగా కనీస బ్యాలెన్స్ ఉన్నవే ఎక్కువని వెల్లడించారు. నగదు ముద్రణ మొదలు వాటి తరలింపు.. లెక్కలు.. భద్రత ఖర్చు రోజురోజుకీ పెరుగుతోందని.. ఏటీఎంల ఏర్పాటు కూడా ఖర్చుతో కూడుకున్నది వ్యాఖ్యానించారు. ఒకసామాన్యుడు నెలకునాలుగు సార్లు ఏటీఎం వాడాల్సిన అవసరం ఉంటుందని తాము భావించటం లేదని ఎస్ బీఐ చీఫ్ వ్యాఖ్యానించారు. ఏమైనా.. బ్యాంకులకు ఖాతాల భారం భారీగా పెరగటానికి ప్రధాని మోడీ మానసపుత్రిక జన్ ధన్ యోజన కార్యక్రమం ఒకటన్నది తేలిపోయింది. మోడీతో లాభం సంగతి తర్వాత.. ఖర్చుల భారం ఎక్కువగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/