Begin typing your search above and press return to search.

ఉచితాలపై ఎస్ బీఐ నివేదిక.. చూస్తే షాకే

By:  Tupaki Desk   |   4 Oct 2022 2:30 AM GMT
ఉచితాలపై ఎస్ బీఐ నివేదిక.. చూస్తే షాకే
X
ఇప్పుడంతా ఉచిత పథకాల కాలం.. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పార్టీలు ఓటర్లకు అన్నీ పంచేస్తామని అంటున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉచిత హామీలు శ్రుతిమించాయి. అయితే, ఉచిత పథకం ఏది? సంక్షేమం ఏది? అనేదానిపై చర్చ కూడా సాగుతోంది. ఓటర్లకు అయాచితంగా ఇచ్చేది ఉచితమేనని చెప్పాలి. విద్య, వైద్యంలో రాయితీలు ఉచిత పథకాల కోవలోకి రావని చెప్పొచ్చు. కాగా, ఉచిత పథకాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) తాజాగా ఓ నివేదిక ఇచ్చింది. ఉచిత పథకాలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నియంత్రణ విధించవచ్చని పేర్కొంది. అంతేగాక ఒక రాష్ట్ర జీడీపీలో ఒక శాతం.. లేదా ఆ రాష్ట్రానికి పన్నుల రూపేణా వచ్చే దాంట్లో ఒక శాతం దాకా ఉచిత పథకాలకు ఖర్చు చేసేలా పరిమితి విధించవచ్చని సూచించింది. ఉచిత పథకాలను టైమ్ బాంబ్ లుగా అభివర్ణిస్తూ ఈ సూచనలు చేసింది.


ఆ 3 రాష్ట్రాలను ఉదాహరణగా చూపుతూ..

ఎస్బీఐ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సారథ్యంలోని కమిటీ ఈ నివేదికను రూపొందించింది. రాష్ట్రాల ఉచిత పథకాలు, వాటి భారం గురించి వివరించింది. అయితే, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, రాజస్థాన్ వంటి వెనుకబడిన రాష్ట్రాలను ఉదాహరణగా చూపుతూ.. వీటి ఆదాయం, పింఛను చెల్లింపు వ్యయం మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మొత్తం విలువ రూ.3 లక్షల కోట్లని పేర్కొంది. జార్ఖండ్‌కు 217శాతం, ఛత్తీస్‌గఢ్‌కు 207శాతం, రాజస్థాన్‌కు 190శాతం అధిక భారంగా ఉందని నివేదిక పేర్కొంది. పింఛను పథకంలో మార్పులు కోరుకుంటున్న రాష్ట్రాలను చూస్తే వాటి పన్నుల ఆదాయం, చెల్లింపుల మధ్య అంతరం మరింత ఎక్కువగా ఉండవచ్చని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది.

పాత పించను పథకానికి వెళ్లనున్న హిమాచల్‌ప్రదేశ్‌లో పన్నుల ఆదాయం, చెల్లింపుల మధ్య అంతరం 450శాతం ఉండగా.. గుజరాత్‌ 138శాతం, పంజాబ్‌ 242శాతంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. బడ్జెటేతర రుణాలు, ప్రభుత్వరంగ సంస్థలు, గ్యారంటీలతో తీసుకున్న ఇతర రుణాలు 2022 ఏడాది జీడీపీలో సుమారు 4.5శాతానికి చేరుకున్నాయి. ఇటువంటి హామీలు మొత్తం తెలంగాణ జీడీపీలో 11.7శాతం ఉండగా.. సిక్కిం 10.8శాతం, ఆంధ్రప్రదేశ్‌ 9.8శాతం, రాజస్థాన్‌ 7.1శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌ 6.3శాతంగా ఉంది. ఈ హామీల్లో అత్యధికంగా 40శాతం విద్యుత్‌ రంగం కోసమే కేటాయించగా.. తర్వాతి స్థానాల్లో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఆహారం, నీటి సరఫరా రంగాలు ఉన్నాయని ఘోష్‌ వెల్లడించారు.

ఇక పాత పెన్షన్‌ పథకాన్ని అమలు చేస్తోన్న లేదా అమలు చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్రాల చెల్లింపులు 2020 ఆర్థిక సంవత్సరంలోనే రూ.3,45,505 కోట్లుగా ఉందన్నారు. ఇక 2023 ఆర్థిక సంవత్సరంలో పలు రాష్ట్రాలు ప్రకటించిన ఉచితాలను ఆయా రాష్ట్రాల జీడీపీ, రెవెన్యూ రాబడులతో పోల్చి చూసినప్పుడు మరింత ఆందోళనకరంగా ఉందని చెప్పారు.

ఏపీ, పంజాబ్‌ జీడీపీలలో 2శాతం..

వివిధ పథకాలు, నగదు బదిలీలు, రాయితీలు, రుణ మాఫీలు, వడ్డీ రహిత రుణాల కోసం ఆయా రాష్ట్రాలు తమ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులపై ఆర్‌బీఐ నివేదిక ప్రకారం.. ఉచిత పథకాల కోసం ఆయా రాష్ట్రాల జీడీపీలో 0.1శాతం నుండి 2.7శాతం వరకు ఖర్చు చేస్తున్నట్లు అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌ వంటి రాష్ట్రాల్ల జీడీపీలో ఇది 2 శాతం మించిపోయిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర జీడీపీ (GSDP)లో ఒకశాతం లేదా రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 1 శాతం ఖర్చుపెట్టేలా సుప్రీంకోర్టు కమిటీ పరిమితి విధించవచ్చని తాజా నివేదిక ద్వారా సూచించింది.