Begin typing your search above and press return to search.

ఎస్బీఐ నిర్వాకం...ఖాతా మారిన 100 కోట్లు!

By:  Tupaki Desk   |   28 Sep 2017 1:11 PM GMT
ఎస్బీఐ నిర్వాకం...ఖాతా మారిన 100 కోట్లు!
X

బ్యాంకులలో అధికారులు అప్పుడ‌పుడు ఒక ఖాతాలోకి బ‌దిలీ చేయాల్సిన న‌గ‌దును వేరే ఖాతాలోకి పొర‌పాటున బ‌దిలీ చేస్తుంటారు. అదేరోజు లేదా మ‌రుస‌టి రోజు జ‌రిగిన పొర‌పాటును గుర్తించి ఆ లావాదేవీని స‌రి చేస్తారు. కానీ, జార్ఖండ్ లోని స్టేట్ బ్యాంక్ అధికారులు పొర‌పాటు మీద పొర‌పాటు చేశారు. ఒక‌రి ఖాతాలోకి బ‌దిలీ చేయాల్సిన 100 కోట్ల రూపాయ‌ల‌ను వేరొక‌రి ఖాతాలోకి బ‌దిలీ చేశారు. అంతేకాదు, ఆ పొరపాటును దాదాపు నెలన్న‌ర‌ రోజుల‌పాటు గుర్తించ‌కుండా నిర్ల‌క్ష్యం వ‌హించారు. చివ‌ర‌కు ఎలాగోలా విష‌యం తెలుసుకొని ఆ మొత్తాన్ని వెన‌క్కు తెప్పించే ప‌నిలో ప‌డ్డారు. దీంతో, ఆ పొర‌పాటుకు కార‌ణ‌మైన‌ బ్యాంకు అధికారిపై సస్పెన్ష‌న్ వేటు ప‌డింది.

రాంచిలోని హటియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రెజ‌రీ బ్రాంచ్ కు చెందిన డిప్యూటీ మేనేజ‌ర్ ఒక‌రు ఈ పొర‌పాటుకు కార‌ణ‌మ‌య్యారు. ఆగ‌స్టు 5 - సెప్టెంబ‌రు 19 ల మ‌ధ్య న ఈ లావాదేవీ జ‌రిగిన‌ట్లు అధికారులు గుర్తించారు. మ‌ధ్యాహ్న‌భోజ‌నానికి సంబంధించిన ఖాతాలో రూ.100 కోట్లు జ‌మ చేయ‌డానికి బ‌దులు పొర‌పాటున ఓ కన్ స్ట్ర‌క్ష‌న్ కంపెనీ ఖాతాకు ఆ మొత్తాన్ని ఆయ‌న బ‌దిలీ చేశారు. ఈ పొర‌పాటును ఆయ‌న నెల‌న్న‌ర రోజుల పాటు గుర్తించ‌లేదు. దీంతో, ఆ కంపెనీ ఆ న‌గ‌దును త‌మ న‌గ‌దుగా భావించి వివిధ ఖాతాల‌కు బ‌దిలీ చేసుకుంది. సాధార‌ణంగా విద్యాశాఖ అధికారులు 3 నెల‌ల‌కోసారి నిధుల‌ను విడుద‌ల చేస్తారు. మూడో నెల‌లో ఆ నిధులు జ‌మ‌కాలేద‌ని వారు గుర్తించ‌డంతో ఈ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. దీంతో, సద‌రు కంపెనీ నుంచి బ్యాంకు అధికారులు దాదాపు 70 కోట్ల రూపాయ‌ల‌ను రిక‌వ‌రీ చేశారు. మ‌రో 30 కోట్ల రూపాయ‌లు బ్యాంకు కు రావాల్సి ఉంది. ఈ వ్య‌వ‌హారానికి కార‌ణ‌మైన అధికారిని ఉన్న‌తాధికారులు స‌స్పెండ్ చేశారు. ఆ అధికారి పొర‌పాటున ఈ విధంగా చేశాడా, లేక ఉద్దేశ‌పూర్వ‌కంగా చేశాడా అన్న విష‌యం తేలాల్సి ఉంది. ఆ అధికారిపై పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ చేస్తున్నారు.