Begin typing your search above and press return to search.

వ్యాపమ్ ను మించిపోయే స్కామ్

By:  Tupaki Desk   |   17 July 2015 7:10 AM GMT
వ్యాపమ్ ను మించిపోయే స్కామ్
X
మధ్యప్రదేశ్ ను కుదిపేసిన వ్యాపమ్ కుంభకోణాన్ని మించిన కుంభకోణమొకటి అదే రాష్ట్రంలో బయటపడింది. ప్రైవేటు డెంటల్, మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే డీమాట్ పరీక్షలో అవకతవకలపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

మధ్య ప్రదేశ్ లో 15 ప్రైవేటు మెడికల్, ఆరు డెంటల్ కాలేజిలున్నాయి. వాటిలో సుమారు 2800 సీట్లున్నాయి. ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజిల సంఘం దీనికి డీమాట్ పరీక్ష నిర్వహిస్తుంది. మొత్తం సీట్లలో 42 శాతం రాష్ట్ర కోటా.... 43 శాతం మేనేజ్ మెంటు కోటా కాగా 15 శాతం ఎన్నారైలకు ఇస్తారు. అయితే... ఈ సీట్ల భర్తీ మెరిట్ ప్రకారం కారకుండా పెద్ద మొత్తాల్లో డబ్బులు తీసుకుని చేపడుతున్నారని కోర్టులో కేసు వేశారు. వ్యాపమ్ కుంభకోణాన్ని బయటకు తెచ్చిన సామాజిక కార్యకర్తలే ఈ కేసునూ తోడారు. వారి పిటిషన్ మేరకు కోర్టుకు కేసు పూర్వపరాలు విన్నది. రూ.15 లక్షల నుంచి రూ.కోటిన్నర వరకు తీసుకుని సీట్లు ఇచ్చేస్తున్నారని పిటిషనర్లు కేసేశారు. డబ్బులు ఇచ్చి ఈ పరీక్ష రాస్తున్నవారు ఖాళీ జవాబు పత్రాలు ఇస్తే కుంభకోణంలో పాత్రధారులైన అధికారులు, సిబ్బంది వారి తరఫున జవాబు పత్రాలు నింపుతారని... ఒక్కోసారి ఒకరి తరఫున ఇంకొకరు పరీక్షలు రాస్తుంటారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. అంతావిన్న ధర్మాసనం.... ఇది వ్యాపమ్ కుంభకోణం కంటే పెద్దదయ్యేలా ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. వాదనలు విన్న తరువాత సుప్రీంకోర్టు... దీనిపై సీబీఐ విచారణ ఎందుకు జరపరాదో చెప్పాలంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.