Begin typing your search above and press return to search.

కోర్టుకు వ్య‌తిరేకంగా కోర్టులో కేసేసిన జ‌డ్జీ!

By:  Tupaki Desk   |   31 March 2017 10:16 AM GMT
కోర్టుకు వ్య‌తిరేకంగా కోర్టులో కేసేసిన జ‌డ్జీ!
X
న్యాయ‌స్థానానికి వ్య‌తిరేకంగా న్యాయ‌మూర్తి అదే కోర్టులో కేసు వేయ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే క‌దా? అలాంటి ఆశ్చ‌ర్యం తాజాగా జ‌రిగింది. కోల్‌క‌తా హైకోర్టు న్యాయ‌మూర్తి సీఎస్ క‌ర్ణ‌న్‌ ఇవాళ కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు బెంచ్ ముందు హాజరయ్యారు. ఏడుగురు సభ్యులు ధర్మాసనం ముందు హైకోర్టు సిట్టింగ్ జడ్జి హాజరుకావడం భారతీయ న్యాయ చరిత్రలో ఇది తొలి సంఘటనగా గుర్తిస్తున్నారు. షరతులు లేని క్షమాపణలు చెప్పేందుకు జడ్జి కర్ణన్ నిరాకరించారు. తిరిగి తనకు న్యాయాధికారుల ఇస్తేనే, తాను క్షమాపణ చెబుతానని కర్ణన్ తెలిపారు. నేను ఉగ్రవాదిని కాను, సంఘవ్యతిరేక శక్తిని కాను అని కర్ణన్ బెంచ్ ముందు వాదించారు. దీంతో కోర్టు ఉల్లంఘన కేసులో నాలుగు వారాల్లోగా రిప్లై ఇవ్వాలని కర్ణన్ కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు సుప్రీంకోర్టు నుంచి వెళ్లిపోతూ కోర్టు రిజిస్ట్రార్ ను కలిశారాయన. తనను విచారించిన ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఎటువంటి విధులను కేటాయించరాదని కర్ణన్ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ను కోరారు.

ఈ కేసు పూర్వాప‌రాల‌ను చూస్తే కోర్టు ఉల్లంఘ‌న కేసులో కోల్‌ క‌తా హైకోర్టు న్యాయ‌మూర్తి సీఎస్ క‌ర్ణ‌న్‌ కు మార్చి 10న సుప్రీంకోర్టు జస్టిస్ కర్ణన్ పై బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో మార్చి 31వ తేదీలోపు హాజరు కావాలంటూ ఆదేశించింది. జస్టిస్ కర్ణన్ హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు బెంగాల్ పోలీసులను కూడా ఆదేశించింది. సుప్రీం చేసిన సూచనను తిరస్కరించిన కర్ణన్ వీలైతే తనను అరెస్టు చేయాలంటూ సవాల్ చేశారు. తనకు అధికారాలు వెనక్కి ఇవ్వకుంటే, మళ్లీ ఇదే కేసులో రెండవ సారి హాజరు కాను అంటూ తేల్చిచెప్పారు. అయితే త‌న‌పై వారెంట్ జారీ చేసి సుప్రీంకోర్టు బెంచ్ న్యాయ‌మూర్తుల‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని సీబీఐని ఆదేశించారు క‌ర్ణ‌న్‌. సీజేఐ జేఎస్ ఖేహార్‌ తోపాటు ధ‌ర్మాస‌నంలోని మిగ‌తా ఆరుగురు న్యాయ‌మూర్తుల‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆయ‌న ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. ఓ హైకోర్టు న్యాయ‌మూర్తికి బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయ‌డం భార‌త న్యాయ‌చ‌రిత్ర‌లోనే తొలిసారి జరిగింద‌ని మీడియాతో మాట్లాడుతూ క‌ర్ణ‌న్ చెప్పారు. కేంద్రంలో ఇప్ప‌టి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాతే ఇలా జ‌రుగుతున్న‌ద‌ని, ద‌ళితుల‌ను అణ‌చివేస్తున్నార‌ని క‌ర్ణ‌న్ ఆరోపించారు. ధ‌ర్మాస‌నంలో ఏడుగురు న్యాయ‌మూర్తుల‌పై కేసు ఫైల్ చేసి, విచార‌ణ జ‌రిపి నివేదిక‌ను ఢిల్లీలోని సీబీఐ కోర్టు ముందు ఉంచాల‌ని సీబీఐ డైరెక్ట‌న్‌ను ఆయ‌న ఆదేశించారు. ఇలాంటి ఆర్డర్ ఇవ్వాల‌ని అడిగిన అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహ‌త్గీపైనా విచార‌ణకు ఆదేశించారు.

క్రిమిన‌ల్ ప్రొసీజ‌న్ కోడ్ (సీపీసీ)లోని సెక్ష‌న్ 482, భార‌త రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 226 ప్ర‌కారం త‌న‌కున్న విశిష్ట అధికారాల‌ను ఉప‌యోగించి ఈ విచార‌ణ‌కు ఆదేశించాను. ఏ కోర్టునూ త‌క్కువ‌గా చూడ‌కూడ‌ద‌నే ఇలా చేశాను. ఈ విచార‌ణ‌లో సుప్రీం న్యాయ‌మూర్తులు.. ఎస్సీ - ఎస్టీ చ‌ట్టంతోపాటు ఐపీసీని ఉల్లంఘించారా లేదా అన్న‌ది తెలుస్తుంది అని క‌ర్ణ‌న్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను లోక్‌ స‌భ స్పీక‌ర్‌ కు అందించాల‌ని లోక్‌ స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌ కు క‌ర్ణ‌న్ ఆదేశించారు. సుప్రీం న్యాయ‌మూర్తుల‌పై విచార‌ణ చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌డంతోపాటు మ‌హాభియోగ తీర్మానానికి ప్ర‌క్రియ మొద‌లుపెట్టేందుకు వీలుగా స్పీక‌ర్‌ కు ఈ ఫైల్ అంద‌జేయాల‌ని క‌ర్ణ‌న్ చెప్పారు. త‌న‌పై సుప్రీం జారీ చేసిన బెయిల‌బుల్ వారెంట్‌ పై స్టే విధించాల‌ని రాష్ట్ర‌ప‌తిని కోరిన‌ట్లు వెల్ల‌డించారు. నిజానికి గ‌త ఫిబ్ర‌వ‌రిలోనే క‌ర్ణ‌న్‌ ను న్యాయ‌, ప‌రిపాల‌న ప‌ర‌మైన విధుల నుంచి సుప్రీంకోర్టు తొల‌గించినా.. ఆయ‌న మాత్రం ఆ ఆదేశాల‌ను పాటించ‌లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/