Begin typing your search above and press return to search.

డీఎస్‌ కు ఇంకో షాక్‌..కుమారుడిపై మ‌రో కేసు

By:  Tupaki Desk   |   11 Aug 2018 4:25 PM GMT
డీఎస్‌ కు ఇంకో షాక్‌..కుమారుడిపై మ‌రో కేసు
X
సీనియర్ నేత - రాజ్యసభసభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కు అనూహ్య‌మైన ప‌రణామాలు ఎదుర‌వుతున్నాయి. ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా ఆయ‌న్ను క‌ష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇప్ప‌టికే ఆయ‌న తనయుడు సంజయ్‌ పై లైంగిక వేధింపుల కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. డీఎస్ కుమారుడు సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నిజామాబాద్ శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినిలు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మధ్య కాలంలో తమలో ఇద్దరిని సంజయ్ బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడులు చేయడానికి ప్రయత్నించారని హోంమంత్రికి విద్యార్థినిలు వివరించారు. వారు ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తుంటే.. అదే సమయంలో ఓ మేడమ్ రావడం వల్ల వదిలిపెట్టారన్నారు. ఆరు నెలలుగా తమను సంజయ్‌ లైంగికంగా వేధిస్తున్నాడని మొత్తం 11 మంది విద్యార్థిని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నిర్భయ చట్టం కింద సంజయ్‌ పై కేసు నమోదు కాగా ఆయ‌న కోసం నాలుగు రాష్ర్టాల్లో పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. తాజాగా సంజ‌య్‌పై తాజాగా ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

డి. శ్రీనివాస్ కుమారుడు సంజయ్‌ పై నమోదైన తాజా కేసులో విచారణకు రెండు రోజుల్లో పోలీసులు స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు త‌మ ఎదుట హాజరు కావాలని సంజయ్ ఇంటికి పోలీసులు నోటీసులు అతికించారు. 41/ఏ సీఆర్‌ పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు . ఈ నెల 12వ తేదీ లోపు హాజరుకాని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. సంజయ్ ఇంటికి అతికించిన నోటీసులను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. సంజయ్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ - మహారాష్ట్ర - కర్నాటక తదితర ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం.

కాగా, తమకు ప్రాణభయమున్నదని - లైంగిక వేధింపులకు పాల్పడిన సంజయ్‌ ను శిక్షించాలని ఈ సందర్భంగా విద్యార్థినులు సీపీని కోరగా వారిచ్చిన ఫిర్యాదు మేరకు సంజయ్‌ పై నిర్భయ చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. అనంతరం పోలీసులు సంజయ్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లగా అప్పటికే పరారీలో ఉన్నట్టు తెలుసుకున్నారు. ఆ తర్వాత తన నివాసంలో ప్రెస్‌ మీట్ పెట్టి తనకు ఏ పాపం తెలియదని చెప్పిన సంజయ్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సంజయ్ కోసం గాలింపు చేపడుతున్నామని, అతనిపై నిర్భయతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సీఐ నరేశ్ వెల్లడించారు.