Begin typing your search above and press return to search.

రఘురామపై ఎస్సీ.. ఎస్టీ కేసు.. ఫిర్యాదు చేసిందెవరంటే?

By:  Tupaki Desk   |   15 Jan 2022 4:38 AM GMT
రఘురామపై ఎస్సీ.. ఎస్టీ కేసు.. ఫిర్యాదు చేసిందెవరంటే?
X
రాజకీయ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై తాజాగా ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మొన్నటికి మొన్న ఫలానా కేసు అన్న వివరాల్ని వెల్లడించకుండా.. హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లిన ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసి రావటం తెలిసిందే. గతంలో ఉన్న కేసుల నేపథ్యంలో విచారణకుహాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఫలానా కేసు అన్న విషయాన్ని మాత్రం అందులో ప్రత్యేకించి పేర్కొనలేదని చెబుతున్నారు.

సంక్రాంతి పండక్కి కాస్త ముందు హైదరాబాద్ కు వచ్చి.. అక్కడి నుంచి తమ సొంతూరైన గోదావరి జిల్లాకు పయనం కావాలని ప్లాన్ చేస్తున్న వైసీపీ రెబల్ ఎంపీకి.. అనూహ్యంగా ఏపీ సీఐడీ నుంచి తాఖీదు అందటం..ఆ వెంటనే ఆయన న్యాయ సలహా కోసం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిపోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తనకు నోటీసులు జారీ చేసిన ఏపీ సీఐడీ అధికారులపై ఆయన కామెంట్లు చేయటం తెలిసిందే.

గతంలో రఘురామ అరెస్టు నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసేఅవకాశం లేదు. కాకుంటే.. గతంలోఉన్న కేసులకు సంబంధించిన విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సీఐడీ అధికారి సునీల్ కుమార్ పై ఎంపీ రఘురామ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని.. ఆయన్ను కులం పేరుతో నిందించటంతోపాటు.. అసభ్యపదజాలంతో దూషించినట్లుగా గొంది రాజు అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశారు.

ఈ నేపథ్యంలో చింతలపూడి పోలీస్ స్టేషన్ లోఎంపీ రఘురామపై ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసినట్లుగా చింతలపూడి పోలీసులు చెబుతున్నారు. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ స్వగ్రామం చింతలపూడికావటంతో.. ఆ గ్రామానికి చెందిన గొంది రాజు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. మరి.. ఈ కేసుపై ఎంపీ రఘురామ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.