Begin typing your search above and press return to search.

న్యూఇయ‌ర్ అమ్మ‌కు క‌లిసి వ‌చ్చేలా లేదా?

By:  Tupaki Desk   |   8 Jan 2016 12:56 PM GMT
న్యూఇయ‌ర్ అమ్మ‌కు క‌లిసి వ‌చ్చేలా లేదా?
X
కాలం క‌లిసి రాక‌పోతే.. ఎన్ని క‌ష్టాల‌న్న‌ది అమ్మ‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ ప్ర‌కృతి విసిరిన స‌వాళ్ల‌తో కిందామీదా ప‌డి త‌న‌కున్న ప‌వ‌ర్ తో వ్య‌వ‌హారాల్ని త‌న కంట్రోల్ లోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె మెడ‌కు కోర్టు కేసులు చుట్టుకున్నాయి. అక్ర‌మాస్తుల కేసు విష‌యంలో జైలు వ‌ర‌కూ వెళ్లిన ఆమె ఆ త‌ర్వాత ఆ కేసు నుంచి బ‌య‌ట ప‌డిన పరిస్థితి. తాజాగా ఆ కేసు మ‌ళ్లీ వెలుగులోకి వ‌చ్చింది. దీనికి సంబంధించిన కీల‌క నిర్ణ‌యం శుక్ర‌వారం తీసుకున్నారు.

గ‌త కొద్దిరోజులుగా అమ్మ ప‌రిస్థితి ఏ మాత్రం బాగోలేదు. కొత్త సంవ‌త్స‌రానికి కొద్దిరోజుల ముందు భీక‌ర వ‌ర్షాల పుణ్య‌మా అని నాలుగేళ్లుగా అమ్మ సంపాదించుకున్న పేరు ప్ర‌తిష్ట‌ల‌న్నీ భారీ వ‌ర‌ద‌లో కొట్టుకుపోయిన ప‌రిస్థితి. చెన్నై మ‌హాన‌గ‌రంలో ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు ఎవ‌రికి వారు సాయం అందించుకుంటూ బ‌తుకు బండిని లాగారే త‌ప్పించి.. ప్రభుత్వం త‌ర‌పు నుంచి అందిన సాయం అంతంత మాత్ర‌మే.

ఇక‌.. అమ్మ గురించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. వ‌ర‌ద పోటుతో చెన్నై వాసులు కిందామీదా ప‌డుతుంటే.. బ‌య‌ట‌కు రావ‌టానికి అమ్మ‌కు చాలా రోజులే ప‌ట్టిన దుస్థితి. దీనిపై తీవ్ర‌స్థాయిలో నిర‌స‌న‌లు వ్య‌క్త‌మైనా.. త‌న‌కున్న అధికార బ‌లంతో వాటిని కొంత‌మేర కంట్రోల్ చేసేశారు.

అక్ర‌మాస్తుల కేసుకు సంబంధించి నిర్దోషిగా ప్ర‌క‌టిస్తూ ఇచ్చిన తీర్పును క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం స‌వాలు చేయ‌టం.. ఆ పిటీష‌న్ ను సుప్రీంకోర్టు ఈ రోజు విచార‌ణ‌కు స్వీక‌రించింది. దీనికి సంబంధించిన విచార‌ణ ఫిబ్ర‌వ‌రి 2 నుంచి ప్రారంభం కానున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణ‌యం అమ్మ‌కు షాకింగ్ గా మారుతుంద‌న‌టంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కేసుకు సంబంధించి జ‌య‌ల‌లిత‌ను నిర్దోషిగా ప్ర‌క‌టిస్తూ క‌ర్ణాట‌క హైకోర్టు ఇచ్చిన తీర్పును క‌ర్ణాట‌క స‌ర్కారు సుప్రీంకోర్టులో స‌వాలు చేయ‌టంతో ఈ ప‌రిస్థితి త‌లెత్తెంది. కొద్ది నెల‌ల్లో త‌మిళ‌నాడు అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో తాజా ప‌రిణామం అమ్మ‌కు ఇబ్బంది క‌లిగించ‌టం ఖాయ‌మ‌ని చెప్పొచ్చు.