Begin typing your search above and press return to search.

ప్ర‌భుత్వం క‌నుస‌న్న‌ల్లో వాట్సాప్‌

By:  Tupaki Desk   |   16 Jan 2017 3:31 PM GMT
ప్ర‌భుత్వం క‌నుస‌న్న‌ల్లో వాట్సాప్‌
X
సామాజిక మాధ్య‌మ దిగ్గ‌జం వాట్సాప్ ను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చే అంశంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వాట్సాప్ లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్ బుక్ తో పంచుకోవడం ప్రైవసీ చట్టాన్ని ఉల్లంఘించడమే అనే కేసుపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఇద్దరు న్యాయ విద్యార్థులు వేసిన పిటీషన్ తరపున న్యాయవాది సాల్వే వాదించారు. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడానికి ఇష్టంలేని పక్షంలో, ఆ సోషల్ మీడియా నుంచి తప్పుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహార్ తెలిపారు. ప్రైవేటు సర్వర్ ను వాడుకుంటూ, వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచడం సాధ్యం కాదని జస్టిస్ అభిప్రాయపడ్డారు.

కోట్లాది కస్టమర్లు ఉన్న వాట్సాప్.. ల్యాండ్ లైన్ టెలిఫోన్ల మాదిరిగా పబ్లిక్ యుటిలిటీ సర్వీస్ గా మారిందని న్యాయవాది సాల్వే తెలిపారు. అయితే న్యాయమూర్తి ఖేహార్ దీనిపై స్పందిస్తూ, టెలిఫోన్ కాల్స్ కు డబ్బులు చెల్లిస్తున్నారని, కానీ వాట్సాప్ కాల్స్ కు డబ్బులు చెల్లించడం లేదన్నారు. ఇప్పుడు టెలి ఫోన్ కాల్స్ కూడా ఫ్రీగా లభిస్తున్నాయని కౌంటర్ గా సాల్వే తెలిపారు. ఆర్టికల్ 19 ప్రకారం భావ స్వేచ్ఛను కాపాడాల్సిన ట్రాయ్ దాన్ని ఉల్లంఘిస్తున్నట్లు స్వాల్వే అన్నారు. వాట్సాప్ ప్రైవసీ అంశంపై సమ్మర్ సెలవుల్లో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఖేహార్ అంగీకరించారు. వాట్సాప్ కేసును వాదించేందుకు అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ సాయం తీసుకోవాలని సాల్వేకు సూచనలు చేశారు జస్టిస్ ఖేహార్.

వాట్సాప్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇవాళ కేంద్రానికి, ట్రాయ్, ఫేస్‌బుక్‌కు నోటీసులు జారీచేసింది. వాట్సాప్ డాటా ప్రైవసీకి సంబంధించి దాఖలైన పిటిషన్‌ పై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫేస్‌ బుక్ - వాట్సాప్ లో ఉన్న డాటాకు రక్షణ లేకపోవడం వినియోగదారుడి ప్రైవసీని దెబ్బతీస్తుందంటూ పిటిషనర్ కర్మన్యసింగ్ తరుపు న్యాయవాది హరీశ్‌ సాల్వే పేర్కొన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/