Begin typing your search above and press return to search.

యువనేతలు అతీతులు కాదా?!

By:  Tupaki Desk   |   28 Jun 2015 5:11 AM GMT
యువనేతలు అతీతులు కాదా?!
X
రాజకీయాల్లోకి యువత వస్తే ఫలితాలు వేరేలా ఉంటాయని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే యుక్త వయసులో రాజకీయాల్లోకి వచ్చి, మంచి పదవులు పొందే అవకాశం వరించిన వారు కూడా సగటు రాజకీయ బురదలోనే కూరుకుపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా వీళ్లపై కూడా విమర్శలు.. ఆరోపణలు తప్పడం లేదు. ఇప్పుడు పంకజ ముండే విషయంలో కూడా అదే జరుగుతోంది.

మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొంత కాలంలోనే మరణించిన గోపినాథ్‌ ముండే తనయ పంకజ. ఒక సీనియర్‌ బీజేపీ నేత తనయ కాబట్టి ..అందులోనూ ఆయన మరణించాడు కాబట్టి.. మహారాష్ట్రలో పంకజకు ప్రాధాన్యం పెరిగింది. ఆమెకు ఫడ్నవీస్‌ ప్రభుత్వంలో క్యాబినెట్‌ మంత్రి పదవి దక్కింది.

మరి ఇదంతా జరిగి ఏడాది అయినా సరిగా కాలేదు.. అప్పుడు పంకజపై పెద్దస్థాయి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకంగా 206 కోట్ల రూపాయల స్కామ్‌ అని అంటున్నారు. పాఠశాలలకు సంబంధించిన పరికరాల, ఆహార పదార్థాల కొనుగోలుకు సంబంధించి ప్రాథమిక ప్రమాణాలు కూడా పాటించకుండానే కోనుగోలు జరిగిపోయిందని.. ఇదంతా పెద్ద కుంభకోణం అని ఆరోపణలు వస్తున్నాయి.

మరి నిజంగానే ఆ స్కామ్‌ జరిగిందా? అంత స్థాయిలో డబ్బు దుర్వినియోగం అయ్యిందా? అనే దానికి రుజువులు లేవు కానీ.. నిప్పులేనిదే పొగరాదు కదా! ప్రాథమిక ప్రమాణాలు పాటించకుండా అన్ని కోట్ల రూపాయల ఒప్పందాలను ఎలా కుదుర్చుకొంటారు? రాజకీయాలనే మార్చేయగల సత్తా ఉంటుందన్న యువశక్తి విషయంలో ఇలాంటి ఆరోపణలు రావడం శోచనీయం. ఇలాంటివన్నీ చూస్తే..ప్రత్యేకంగా యువత రాజకీయాల్లోకి వచ్చి సాధించేది ఏముంది? అనే సందేహం కూడా కలుగుతుంది కదా!