Begin typing your search above and press return to search.

పాఠ‌శాల క‌రెంటు బిల్లు రూ.6 కోట్లు..!

By:  Tupaki Desk   |   24 Jan 2021 4:30 PM GMT
పాఠ‌శాల  క‌రెంటు బిల్లు రూ.6 కోట్లు..!
X
కొవిడ్ లాక్ డౌన్ స‌మ‌యంలో విద్యుత్ సిబ్బంది విధులు ఆగిపోవ‌డంతో క‌రెంటు బిల్లుల్లో ఎంత‌టి తేడాలు వ‌చ్చాయో అంద‌రికీ తెలిసిందే. పూరి గుడిసెలకు కూడా రూ.లక్షల్లో బిల్లులు వ‌చ్చాయి. ప్రతినెలా వ‌చ్చే బిల్లుకు సంబంధం లేకుండా డ‌బ్బులు క‌ట్టాల్సి రావ‌డంతో జ‌నం తీవ్ర ఆవేద‌న వ్య‌క్తంచేశారు. అయితే.. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి తాజాగా వెలుగు చూసింది. ఓ ప్రభుత్వ పాఠశాలకు ఏకంగా రూ.6 కోట్ల మేర క‌రెంటు బిల్లు వేయ‌డం గ‌మ‌నార్హం. ఈ ఘటన ఒడిశాలోని కటక్ జిల్లాలో చోటుచేసుకుంది.

కటక్‌ జిల్లా కంటపాడ సమితి శిశువా పాఠశాలకు సుమారు రూ.6 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. ఈ విష‌యాన్ని పాఠశాల హెడ్మాస్టర్ కవితా రాణి సాహు వెల్ల‌డించారు. 2016లో స్కూల్‌కి విద్యుత్ కనెక్షన్ ఇవ్వ‌గా.. అప్పటి నుంచి ఒక్కసారి కూడా బిల్లు రాలేదట‌. కాగా.. గతేడాది ఫిబ్రవరిలో తొలిసారి బిల్లు వేసిన విద్యుత్ సిబ్బంది.. ఆ మొత్తం రూ.5,87,12,580లుగా చూపించార‌ట. 2020 ఫిబ్రవరి 17లోగా దీనిని చెల్లించాలని, గడువులోగా చెల్లించకపోతే పెనాల్టీతో కలిపి రూ.5,92,82,212 చెల్లించాలని మ‌రో బిల్లు కాగితం చేతిలో పెట్టార‌ట‌.

ఈ విష‌యాన్ని గ‌తంలోనే స్థానిక విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేస్తే.. సాంకేతిక సమస్య వల్ల తప్పుడు బిల్లు వచ్చిందని, సరి చేసి కొత్త బిల్లు పంపిస్తామని చెప్పార‌ట‌. అంతలోనే కరోనా లాక్‌డౌన్ విధించడంతో స్కూల్స్ మూతబడ్డాయి. తిరిగి పది నెలల తర్వాత ఇటీవల తెరుచుకున్నాయి. దీంతో జనవరి 20న మళ్లీ బిల్లు వ‌చ్చింద‌ట‌. అందులో రూ.6 కోట్లకుపైగా చెల్లించాలని సూచించార‌ట‌. ఈ విష‌యాన్ని మీడియా ప్రతినిధులు కూడా విద్యుత్తు సరఫరా విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన‌ప్ప‌టికీ ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ట‌.

స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కవితా రాణి మాట్లాడుతూ.. ఈ బిల్లుపై టీపీసీఓడీఎల్ అధికారులను కలిశామని చెప్పారు. అయితే.. వారు బిల్లు చెల్లించాలని, లేకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని చెప్పారని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. అయితే.. గోపాల్‌పూర్ ఎస్డీఓ ఛాబిలా బెహ్రా మాత్రం.. సాంకేతిక లోపం వల్లే బిల్లు కోట్లలో వచ్చిందని, దానిని పరిశీలించి తగిన చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చార‌ట‌.