Begin typing your search above and press return to search.

లిక్క‌ర్ అయిపోయింది.. ఇప్పుడు స్కూళ్లు.. 13 వంద‌ల కోట్ల స్కాం: ఆప్‌పై బీజేపీ మ‌రో అస్త్రం

By:  Tupaki Desk   |   26 Nov 2022 10:36 AM GMT
లిక్క‌ర్ అయిపోయింది.. ఇప్పుడు స్కూళ్లు.. 13 వంద‌ల కోట్ల స్కాం:  ఆప్‌పై బీజేపీ మ‌రో అస్త్రం
X
ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీపై కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు వ‌రుస దాడులు చేస్తోంది. ఇప్ప‌టికే లిక్క‌ర్ స్కాం అంటూ.. హ‌డావుడి చేసినా, మంత్రి మ‌నీశ్ సిసోడియా ఇంట్లోసోదాలు చేసినా, ఆయ‌న పాత్ర‌ను మాత్రం సీబీఐ వెల్ల‌డించ‌లేక పోయింది. అయితే, బ‌హుశ దీనిపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల నుంచి త‌ప్పించుకునే వ్యూహం కాబోలు.. వెంట‌నేమ‌రో కేసు ఊపందుకుంది.

ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన పాఠశాల తరగతి గదుల నిర్మాణంలో 1,300 కోట్ల రూపాయ‌ల‌ కుంభకోణం జరిగిందని.. ఈ అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ సిఫార్సు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేసిన నివేదికలో ఈ విషయాలున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనిపై వెంటనే స్పందించిన బీజేపీ నేతలు.. విద్యాశాఖ మంత్రి మనీశ్‌ సిసోడియాను పదవి నుంచి తొలగించాలని, లేదంటే ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్ 2020 ఫిబ్రవరి 17వ తేదీతో రూపొందించిన నివేదికలో.. డిల్లీ ప్రభుత్వం చేపట్టిన 2400 తరగతి గదుల నిర్మాణంలో భారీ అక్రమాలు జరిగాయని పేర్కొంది. ప్రజా పనుల విభాగం పర్యవేక్షణలో ఈ పనులు జరిగాయి. అదే నెలలో ఈ నివేదికను ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన విజిలెన్స్‌ డైరెక్టరేట్‌కు పంపించి, దాని అభిప్రాయం తెలపాలని కోరింది.

అయితే, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా అడిగే వరకు కూడా విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ రెండున్నరేళ్ల పాటు ఆ నివేదిక గురించి నోరు మెదపలేదు.

ఈ జాప్యానికి కారణమేమిటో దర్యాప్తు చేయాలని ఈ ఏడాది ఆగస్టులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గవర్నర్‌ ఆదేశించారని అధికార వర్గాలు తెలిపాయి. రూ.1300 కోట్ల కుంభకోణంలో విద్య, ప్రజా పనుల విభాగాల అధికారుల ప్రమేయం ఉందని, అక్రమాలకు వారిని బాధ్యులను చేయాలని విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ సిఫార్సు చేసినట్లు సమాచారం.

కేజ్రీవాల్‌ ప్రభుత్వం టెండర్లు పిలవకుండానే ఓ నిర్మాణ సంస్థకు పనులను కట్టబెట్టిందని, మరుగుదొడ్లు నిర్మించి వాటిని తరగతి గదులుగా చూపారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ఆరోపించారు. అవినీతికి పాల్పడిన విద్యా మంత్రిని తొలగించాలని, లేదంటే ముఖ్యమంత్రి పదవి నుంచి కేజ్రీవాల్‌ వైదొలగాలని డిమాండ్‌ చేశారు. ఇక‌, ఈ వివాదం ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.