Begin typing your search above and press return to search.

ఏపీలో ఆగస్టు 16 నుంచి స్కూళ్లు .. ఆఫ్ లైన్ లో క్లాసులు !

By:  Tupaki Desk   |   10 Aug 2021 12:30 PM GMT
ఏపీలో ఆగస్టు 16 నుంచి స్కూళ్లు .. ఆఫ్ లైన్ లో క్లాసులు !
X
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పున:ప్రారంభంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 16 నుంచి స్కూల్స్ తిరిగి ఓపెన్ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు. అదే స్కూల్స్ రీ-ఓపెన్ రోజున నూతన విద్యా విధానంపై సమగ్రంగా వివరిస్తామని సీఎం జగన్ తెలిపారు. విద్యార్ధులకు విద్యాకానుక కిట్‌లను సైతం అదే రోజున పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 16 నుంచి ఇంటర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గత నెల 12 వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు ఆన్‌ లైన్‌ క్లాసులు కొనసాగుతున్నాయి.

16వ తేదీ నుంచి ఆఫ్ లైన్ లో నే పూర్తి స్థాయిలో పాఠశాలు తెరుస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నేడు అమరావతిలో ప్రకటించారు. ఏపీలో స్కూళ్లను రీ-ఓపెన్ చేస్తున్నామని తెలిపిన ఆయన, ఎప్పటి మాదిరే రెగ్యులర్ టైమింగ్సులోనే స్కూళ్లను రన్ చేస్తామని వెల్లడించారు. కరోనా వైరస్ ప్రొటోకాల్ పాటించేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తైంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోని మిగిలిన టీచర్లకు కూడా టీకాలు వేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించాం. ఆన్ లైన్ తరగతులు రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదు అని మంత్రి స్పష్టం చేశారు.

కరోనా నిబంధనలకు అనుగుణంగా ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు నిర్వహించాలని‌ కళాశాల యాజమాన్యాలకి, ప్రిన్సిపాళ్లకి ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీచేసింది. ఆగష్టు 16 నుంచి స్కూల్స్ తిరిగి ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పాఠశాలలు ప్రారంభం అయ్యే లోపు టీచర్లకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని చెప్పారు. 16వ తేది పాఠశాలలు ప్రారంభం రోజునే పిల్లలకి జగనన్న విద్యా కానుక అందజేస్తామని మంత్రి సురేష్ చెప్పారు. విద్యాకానుకలో ఈసారి డిక్షనరీ కూడా ఇస్తున్నామన్నారు. 15వేల స్కూళ్లను నాడు-నేడు కింద అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. మొదటి దశ నాడు-నేడును 16వ తేది ప్రజలకు అంకితం చేస్తామన్నారు. అదే రోజు రెండో విడత నాడు-నేడు పనులను కూడా ప్రారంభిస్తామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.

విద్యాశాఖలో నూతన విద్యా విధానం అమలు చేస్తున్నామని, ఆ కారణం చేత ఏ ఒక్కరి పోస్ట్ పోదని, అదనంగా ప్రమోషన్స్ ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ఏ ఒక్క పాఠశాలను మూసివేయమని, అవసరం అయితే నూతన పాఠశాలలు నిర్మిస్తామని వెల్లడించారు. గిరిజనులు, దళితుల అభివృద్ధి కోసం వైసీపీ సర్కార్ తీవ్రం కృష్టి చేస్తోందని మంత్రి చెప్పారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో 45 కోట్ల రూపాయల నిధులతో డోర్నాలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపు ఏడాదిన్నరగా విద్యార్థులు ఆన్‌ లైన్ క్లాసులకే పరిమితమైన విషయం తెలిసిందే. ఆన్‌ లైన్ క్లాసుల కంటే భౌతికంగా స్టూడెంట్స్ క్లాసులకు హాజరైతేనే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి