Begin typing your search above and press return to search.

రక్తంలో అవి ఎక్కువైతే.. కోవిడ్ ముప్పు మీదపడ్డట్లేనట!

By:  Tupaki Desk   |   8 Aug 2020 11:30 PM GMT
రక్తంలో అవి ఎక్కువైతే.. కోవిడ్ ముప్పు మీదపడ్డట్లేనట!
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ -19 పై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. దీని మూలాల్ని కనుక్కోవటంతో పాటు.. మనిషి శరీరంలోకి వెళ్లిన తర్వాత ఏం చేస్తుంది? మనిషి ఆరోగ్యాన్ని ఎలా దెబ్బ తీస్తుంది? లాంటి అంశాలతో పాటు.. లోతైన పరిశోధన చేపట్టారు. అమెరికాలో తాజా అధ్యయనంలో కొత్త విషయాన్ని అక్కడి శాస్త్రవేత్తలు గుర్తించారు.

కరోనా సోకిన 299 మంది రోగుల్ని జార్జి వాషింగ్టన్ వర్సిటీ ఆసుపత్రిలో శాస్త్రవేత్తలు పరిశీలించారు. వారి రక్త నమూనాలు సేకరించి.. వాటిపై పరిశోధనలు చేశారు. ఈ సందర్భంగా వారు పలు అంశాల్ని గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాల్ని ఫ్యూచర్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించారు.
అవేమంటే..

- తొలుత కోవిడ్ రోగులకు చికిత్స ప్రారంభించినప్పుడు.. వారికి నయం కావటమో లేదంటే అధ్వానంగా ఉండటమో చూశాం.
- ఎందుకిలా జరుగుతుందన్న దానిపై అవగాహనకు రాలేకపోయాం. ఎప్పుడైతే.. చెడు ఫలితాలకు బయో మార్కర్లకు సంబంధం ఉందన్న విషయం చైనాలోని ప్రాథమిక అధ్యయనాలు నిరూపించాయో.. వాటికి సంబంధించిన వివరాల్ని తెలుసుకోవలన్న ఉద్దేశంతో పరిశోధనలు చేశాం.
- మొత్తం 299 మంది రక్త నమూనాల్లో 200మంది శాంపిళ్లలో ఐఎల్6, డి-డిమర్, సీఆర్ పీ, ఎల్ డీహెచ్, ఫెరిటిన్ బయో మార్కర్ల మోతాదు ఎక్కువగా ఉన్నాయి
- రక్తంలో వీటి మోతాదు పెరిగితే ఊపిరితిత్తుల్లో వాపు.. రక్తస్రావం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
- లీటరు రక్తంలో ఎల్ డీహెచ్ 1200 యూనిట్లు.. డి-డిమర్ స్థాయి మిల్లీ లీటరుకు మూడు మైక్రోగ్రాముల కన్నా ఎక్కువైతే మరణం ముప్పు పెరుగుతుంది.
- బయో మార్కర్ల విశ్లేషణ ఆధారంగా కోవిడ్ బారిన పడి.. ఆరోగ్యం విషమించే ప్రమాదం పొంచి ఉన్న వారిని ముందే గుర్తించే వీలుంది.
- రక్తంలోని బయోమార్కర్ల ఆధారంగా ముందే గుర్తిస్తే చికిత్స విధానం ముందే సిద్ధం చేసుకునే వీలుంది.
- ఈ వివరాలు తెలీటం ద్వారా బాధితుడ్ని డిశ్చార్జి చేయాలా? ఇంటికి పంపిన తర్వాత అతడ్ని ఎలా పర్యవేక్షించాలి? లాంటి అంశాలపై వైద్యులు ఒక నిర్ణయానికి రావొచ్చు.