Begin typing your search above and press return to search.

వలసకార్మికుల్ని వారి ఊళ్లకు రైళ్లల్లో పంపేందుకు తెలంగాణ రాష్ట్రం ఎంత కట్టిందంటే?

By:  Tupaki Desk   |   21 May 2020 5:30 AM GMT
వలసకార్మికుల్ని వారి ఊళ్లకు రైళ్లల్లో పంపేందుకు తెలంగాణ రాష్ట్రం ఎంత కట్టిందంటే?
X
కొన్ని విషయాల్లో మోడీ సర్కారు తీరు ఎంత కఠినంగా ఉంటుందనటానికి ఈ ఉదంతాన్ని చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు. విపత్తు విరుచుకుపడిన వేళ.. లక్షలాదిగా ఉన్న వలసకార్మికులు ఎవరికి వారు తమ సొంతూళ్లకు కాలినడకన బయలుదేరి వెళ్లిన దయనీయ సీన్.. దేశప్రజలకు కన్నీళ్లను తెప్పించింది. ఇంత పెద్ద దేశంలో.. మోడీ లాంటి మహనీయుడు అధికారంలో ఉన్నప్పుడు వలసకూలీలు ఊళ్లకు నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? దానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు సూటి సమాధానాన్ని చెప్పలేక పోతారు కమలనాథులు.

ఇదిలా ఉంటే.. శ్రామిక్ రైళ్లను తెర మీదకు తెచ్చిన మోడీ సర్కారు.. వలసల్ని తరలించేందుకు తాము చేస్తున్న గొప్పపనిగా చెప్పుకోవటం కనిపిస్తుంది. అయితే.. ఈ రైళ్లకు మామూలు టికెట్ తో పోలిస్తే.. పెద్ద ఎత్తున చార్జీలు చెల్లిస్తే కానీ రైలుబండి కదలని పరిస్థితి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలసకార్మికులు లక్షలాదిగా తెలంగాణలో ఉన్నారు.

వారంతా తమ ఊళ్లకు వెళ్లేందుకు కాలినడకను ఎంచుకున్నారు. ఈ తీరును మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నా.. వారిలో అశాంతి పెరిగి పోవటంతో.. వెళ్లే వారు తమకు తోచినట్లుగా వెళ్లిపోవచ్చన్నట్లు ఉండిపోయింది. దేశ వ్యాప్తంగా ఇలాంటి సీన్లు తెర మీదకు రావటం.. మీడియాలో పెద్ద ఎత్తున ఫోకస్ కావటంతో మోడీ సర్కారు ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. ఈ సమయంలోనే శ్రామిక్ రైళ్ల కాన్సెప్టు తెర మీదకు వచ్చింది.

అయితే.. ఈ రైళ్లు ఏమీ ఉచితం కాదు. అన్ని పెయిడ్ సర్వీసులే. అది కూడా మామూలు టికెట్లతో పోలిస్తే ఎక్కువగా వసూలు చేసే పరిస్థితి. ఈ తీరును ఇప్పటికే తీవ్రంగా తప్పు పట్టారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. విపత్తు వేళ.. సానుకూలంగా వ్యవహరించాల్సిన అంశాల్లోనూ కేంద్రం తీరు బాగోలేదని ఆయన నిప్పులు చెరిగారు. ఆయన వాదనకు బలం చేకూరే గణాంకాలు తాజాగా బయటకు వచ్చాయి.

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 74 రైళ్లలో 1,01,146 మందిని తరలించినట్లుగా తేలింది. వీరి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.8.5 కోట్లు రైల్వేలకు చెల్లించాల్సి వచ్చింది. వలసకార్మికుల్ని పెద్ద ఎత్తున వారి రాష్ట్రాలకు పంపేందుకు సిద్ధమైనా.. ఆయా రాష్ట్రాల వారు తాము సిద్ధంగా లేమని చెప్పటంతో తక్కువ సంఖ్యలో పంపాల్సి వచ్చింది. ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఏయే రాష్ట్రాలకు ఎన్నెన్ని రైళ్లు నడిపారన్నది చూస్తే..
బీహార్ కు అత్యధికంగా 26 రైళ్లు.. ఉత్తరప్రదేశ్ కు 14 రైళ్లు.. జార్ఖండ్ కు పదకొండు రైళ్లు.. రాజస్థాన్ కు ఐదు రైళ్లు.. ఒడిశాకు నాలుగు రైళ్లు.. చత్తీస్ గఢ్ కు రెండు రైళ్లు..ఈశాన్య రాష్ట్రాలకు రెండు రైళ్లు.. ఉత్తరాఖండ్.. పశ్చిమబెంగాల్.. జమ్ము కశ్మీర్.. పంజాబ్ రాష్ట్రాలకు ఒక్కో రైలు చొప్పున పంపారు. ఇదంతా తెలిసిన తర్వాత వలస కార్మికుల్ని తరలించే విషయంలో మోడీ సర్కారు చేసిందేమిటి? అన్న సందేహం కలుగక మానదు.