Begin typing your search above and press return to search.

జగన్ బాటలోనే మోడీ సర్కారు నడుస్తోందిగా?

By:  Tupaki Desk   |   30 March 2020 8:50 AM GMT
జగన్ బాటలోనే మోడీ సర్కారు నడుస్తోందిగా?
X
ఒక పెను విపత్తును ఎదుర్కొనాలన్నా.. దాని మీద పోరాటం చేయాలన్నా కొన్ని సమస్యలు తప్పవు. వాటికి అధిగమించేందుకు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. కొన్ని ప్రభుత్వాలు అలా తీసుకునే నిర్ణయాల్ని తప్పు పట్టటం.. గుడ్డు మీద ఈకలు పీకినట్లుగా తమకు తోచిన వాదనను వినిపించటం లాంటివి చేస్తుంటారు. మొన్నీ మధ్యనే తెలుగు రాష్ట్రాలకు చెందిన మేదావి బ్యాచ్ ఒకటి జగన్ సర్కారుపై ఒంటి కాలి మీద ఎగిరెగిరి పడ్డారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్న వేళ.. తమకు మించిన తోపులు ఇంకెవరూ ఉండరన్నట్లుగా వ్యవహరించే వారు తమకు తోచిన తీర్పులు ఇచ్చేశారు.

తెలంగాణ నుంచి ఏపీకి చెందిన వారు పలువురు రాష్ట్ర సరిహద్దుల వద్దకు చేరుకుంటే.. అరే.. మనోళ్లు సరిహద్దుల వద్దకు చేరితే పెద్ద మనసుతో లోపలకు అనుమతించకుండా అలా ఉంచేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా.. జగన్ సర్కారు మాత్రం నో చెప్పేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే రాష్ట్రాల్లో ఉన్నోళ్లను ఏపీలోకి అనుమతించమని కరాఖండిగా చెప్పేశారు. అదేంటి? జగన్ అంత కటువుగా వ్యవహరిస్తారా? అంటూ ఆశ్చర్యపోయినోళ్లు ఉన్నారు.

అయితే.. వీరంతా మర్చిపోయిన కీలకమైన విషయం రాష్ట్రం సరిహద్దుల్లో ఉన్న వేలాది మందిని రాష్ట్రంలోకి రానిస్తే.. అందులో పాతిక మంది ఉంటే చాలు.. యావత్ రాష్ట్రంలోని కోట్లాది మందికి ముప్పు వాటిల్లుతుందన్న విషయం. తమ సుఖం తప్పించి.. తమ రాక తమ వారి ప్రాణాల మీదకు తెస్తుందన్న విషయాన్ని మర్చిపోయారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదన్న విషయాన్ని తాజాగా కేంద్రంలోని మోడీ సర్కారు చెప్పేసింది.

ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారు తమ సరిహద్దుల్ని మూసివేయాలని.. ఇతరుల్ని ఎవరిని రానివొద్దంటూ కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలు.. రాష్ట్రాల్లోని జిల్లాల సరిహద్దుల్ని మూసి వేయాలన్నారు. ఎందుకిలా అంటే.. ఎక్కడి వారు అక్కడే ఉండిపోతే కరోనా వ్యాప్తి ఆగుతుంది. చైన్ కట్ అవుతుంది. ఇదే సూత్రాన్ని నమ్మిన జగన్ ను విమర్శించిన వారు.. ఈ రోజున ఆయన బాటలోకే మోడీ సర్కారు నడుస్తూ.. యావత్ దేశమంతా అదే సూత్రాన్ని అమలు చేయాలని ఆదేశించిన తీరు చూస్తే.. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయటంలో జగన్ సర్కారు ఎంత ముందుచూపును ప్రదర్శించిందో ఇట్టే అర్థమైపోతుంది.