Begin typing your search above and press return to search.

వైసీపీలో లొల్లికి చెక్ : వాసుపల్లికి సీటు కన్ ఫర్మ్

By:  Tupaki Desk   |   20 July 2022 2:30 AM GMT
వైసీపీలో లొల్లికి చెక్ :  వాసుపల్లికి  సీటు కన్ ఫర్మ్
X
వైసీపీలో వర్గ పోరును వీలున్న చోట్ల సర్దుబాటు చేసే పనిలో అధినాయకత్వం పడింది. గట్టిగా రెండేళ్ళు కూడా లేని సార్వత్రిక ఎన్నికల వేళ ముందు సొంత ఇంట్లో చక్కబెట్టుకుని అన్ని విధాలుగా పరిస్థితులను అనుకూలం చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించిన హై కమాండ్ ఆ దిశగా అడుగులు వేసింది అని చెప్పాలి.

ఇక చూస్తే విశాఖ సౌత్ సీటులో వైసీపీలో వర్గ పోరు తారస్థాయిలో ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీకి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్. ఆయన్ని వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున నిలబెట్టాలని పార్టీ ఆలోచిస్తోంది. అయితే ఇదే సీటు మీద బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ కన్నేశారు. ఆయన సౌత్ లో తిరుగుతూ తానే ఎమ్మెల్యే అభ్యర్ధి అని చెప్పుకుంటున్నారు.

దాంతో పాటు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వర్గాన్ని ఆయన కూడగడుతున్నారు. ఆయనకు ఎంపీ విజయసాయిరెడ్డి అండదండలు కూడా ఉండడంతో ఆయన ఈ మధ్యదాకా దూకుడు చేస్తూ వచ్చారు. నిజానికి విశాఖ సౌత్ లో బ్రాహ్మిణ్స్ డామినేషన్ కూడా ఎక్కువే. గతంలో ఇక్కడ నుంచి ద్రోణం రాజు శ్రీనివాస్ రెండు సార్లు గెలిచారు. దాంతో ఆ వారసత్వాన్ని కొనసాగించడానికి సుధాకర్ ముందుకు వచ్చారు.

ఈ పరిణామాలతో వాసుపల్లి మనస్తాపం చెంది పార్టీ అప్పగించిన నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేశారు. ఆయన ఉమ్మడి విశాఖకు కొత్తగా రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి ఎదుటనే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పరిగెత్తే గుర్రానికి తన్నే గుర్రానికి మధ్య తేడాను తెలుసుకోవాలని కూడా ఈ మధ్య జరిగిన జిల్లా ప్లీనరీలో కూడా హై కమాండ్ కి చెప్పాల్సింది చెప్పేశారు.

అయితే ఆయన్ని బుజ్జగించి రాజీనామాను వెనక్కు తీసుకునేలా చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది. అయితే వర్గ పోరు లేకుండా చూడాలనుకున్న జగన్ సుధాకర్ ని తీసుకువచ్చి ఉత్తరాంధ్రా పట్టభద్రుల సీటుకు ఎంపిక చేశారు. ఆయనకు అర్ధబలం బాగానే ఉంది. అందరితో పరిచయాలు కూడా ఉన్నాయి. పైగా పార్టీ అధికారంలో ఉంది. మూడు జిల్లాలలో బ్రాహ్మణ సామాజికవర్గం ఓటర్లు కూడా టర్న్ అయితే గెలుపు సులువే.

ఈ లెక్కలతో ఆయన్ని పెద్దల సభకు తీసుకురావాలని జగన్ ఆలోచించారు. అదే టైమ్ లో విశాఖ సౌత్ ఊసు పట్టకుండా ఆయన్ని కట్టడి చేశారు. మరో వైపు వాసుపల్లికి వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఖాయమని చెప్పేసినట్లు అయింది. ఈ పరిణామంతో వాసుపల్లి వర్గీయులు సంబరాలు చేసుకోగా సుధాకర్ వర్గీయులు సైతం హ్యాపీగానే ఉన్నారు. ఎమ్మెల్సీగా గెలిస్తే ఆరేళ్ళ పాటు హ్యాపీగా పెద్దల సభలో కుదురుకోవచ్చు. దాంతో పాటు ఎనిమిది నెలల ముందు నుంచే పార్టీ ప్రకటించడంతో ఓటర్ల లిస్ట్ ముందు పెట్టుకుని జనాలను తమ వైపునకు తిప్పుకోవడానికి కూడా వీలు అవుతుంది. మొత్తానికి అటు సుధాకర్ కి న్యాయం జరిగింది అని అంటున్నారు.