Begin typing your search above and press return to search.

మహాకూటమి మేల్కొనేదెప్పుడు.?

By:  Tupaki Desk   |   7 Oct 2018 7:56 AM GMT
మహాకూటమి మేల్కొనేదెప్పుడు.?
X
తెలంగాణ ఎన్నికల నగారా మోగింది.. 105మంది అభ్యర్థులను టీఆర్ ఎస్ ఏకపక్షంగా ప్రకటించేసింది. అభ్యర్థులంతా ప్రచారంతో నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. మరి మహాకూటమి సంగతేంటి.? సీట్ల సర్దుబాటు ఎపిసోడ్ కు ఇంకా ముగింపే ఇవ్వలేదు.. ఎన్నికల తేదీల ప్రకటన వచ్చినా తర్వాత అయినా మహాకూటమి అలెర్ట్ అవుతుందా.? సీట్ల తకరారు.. బేధాభిప్రాయలు వీడి టీఆర్ఎస్ పై కత్తి దూస్తుందా అన్నది అంతుచిక్కని వ్యవహారంగా మారింది.

బలమైన టీఆర్ ఎస్ ను ఓడించేందుకు పొత్తు పాలిటిక్స్ కు తెరదీసిన కాంగ్రెస్ కు మొదట టీడీపీ - టీజేఎస్ - సీపీఐ సై అన్నాయి. కానీ మొదట చూపించిన ఉత్సాహం.. సీట్ల సర్దుబాటు విషయానికి వచ్చేసరికి లేకుండా పోయింది. టీజేఎస్ కోదండరాం కోర్కెల చిట్టా పెద్దదిగా ఉండడం.. టీడీపీకి తాహతకు మించి సీట్లు అడుగుతుండడంతో సీట్ల సర్దుబాటు కావడం లేదు. దీంతో ఈ పక్షాలు వెళ్లిపోతే మహాకూటమి పేరు ఉంచాలా ..? తీసేయాలా అన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉందట.. ఎన్నిసార్లు స్టార్ హోటల్లలో భేటి అయినా ఎడతెగని సీట్ల పంచాయతీతో మహాకూటమి ముందడుగు వేయడం లేదట..

మహాకూటమిని తామే లీడ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ.. కాదు.. తన కంట్రోల్ లో ఉంచాలని కోదండరాం పట్టుబడుతుండడంతో ఈ పంచాయతీ తేలడం లేదు. ఉమ్మడి ఎన్నికల ప్రణాళికపై కూడా కోదండరాం చైర్మన్ గిరీ కోసం పోటీపడుతున్నాడట.. దీంతో తాను కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే కూటమిలో ఉండనని కోదండ కూడా మొండికేస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఇలా సీట్ల లెక్క తేలకముందే ఎన్నికల కమిషన్ బాంబు పేల్చింది. డిసెంబర్ 7న తెలంగాణ పోలింగ్ కు నోటిఫికేషన్ వేసింది. మరో 44 రోజుల్లో నామినేషన్లకు గడువు ఉంది. కేవలం 60 రోజుల్లోనే ఎన్నికలున్నాయి.

ఇంత క్లిష్ట పరిస్థితి వచ్చినా ఇంకా కాంగ్రెస్ కానీ, ఇతర పక్షాలు కానీ సీట్ల సర్దుబాటుపై ఉత్సాహం చూపించకపోవడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలవరం రేపుతోంది. తాము కోరిన స్థానాలను మిత్రపక్షాలకు కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటని అన్ని కూటమి పార్టీలు ఆందోళనగా ఉన్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ నేతల్లోనే కలవరం ఎక్కువగా ఉంది. ఇంకా నింపాదిగా.. తాపీగా చర్చలు జరపడానికి సమయం లేదు. డిసెంబర్ 5లోపే ఏమైనా చేయాలి.. ఆ తర్వాత కుదరదు. ఈ నేపథ్యంలోనే మహాకూటమి ఇప్పటికైనా యాక్టివ్ అవుతుందా లేదా అన్నది తెలంగాణ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది.