Begin typing your search above and press return to search.

జనసేనకు 2 ఎంపీ, 25 అసెంబ్లీ సీట్లు?

By:  Tupaki Desk   |   11 Dec 2017 8:05 AM GMT
జనసేనకు 2 ఎంపీ, 25 అసెంబ్లీ సీట్లు?
X
జనసేనతో పొత్తుకు తెలుగుదేశం పార్టీ లెక్కలేస్తోంది. ప్రస్తుతం రాజకీయంగా పవన్‌ కు ఉన్న ఫాలోయింగ్.. రాష్ర్టంలో - కేంద్రంలో రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఇందుకు గల అవకాశాలను, పవన్ ముందుంచాల్సిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కేంద్రం నుంచి సహాయ నిరాకరణ - రాష్ర్టంలో కాపు సామాజికవర్గ ఓట్ల అవసరం నేపథ్యంలో బీజేపీని వదిలించుకుని - పవన్‌ తో కలిసి సాగడానికే చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయవర్గాల నుంచి తెలుస్తోంది.

అయితే.... జనసేనతో అధికారికంగా పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు ఇవ్వొచ్చు అన్న విషయంలో టీడీపీ ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో పవన్ పార్టీకి రెండు పార్లమెంటు సీట్లు - 25 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జనసేనకు అరకు - కాకినాడ లోక్ సభ సీట్లు ఇవ్వాలని టీడీపీ భావిస్తోందట. అయితే.. మరి ఈ అంశం చర్చల వరకు వచ్చినప్పుడు పవన్ ఎంతవరకు అంగీకరిస్తారన్నది చూడాలి. ఎందుకంటే ఈ రెండు సీట్లలో అరకుపై జనసేన పెద్దగా ఆశలు పెట్టుకోకపోవచ్చు. ఈ స్థానం నుంచి 2014లో వైసీపీ నుంచి కొత్తపల్లి గీత గెలిచారు. ఆ వెంటనే ఆమె టీడీపీలోకి వచ్చినా అక్కడా పూర్తిస్థాయిలో కొనసాగలేదు. అక్కడ వైసీపీ - టీడీపీలకూ నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ క్యాడర్ లేని జనసేన వంటి పార్టీకి అంతపెద్ద నియోజకవర్గం - అందులోనూ అంతా ఏజెన్సీ ప్రాంతం అయినచోట ఎంతవరకు అవకాశం ఉంటుందని అనుమానమే. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం పోటీ చేసింది... ఆ పార్టీ నుంచి పోటీ చేసిన మీనక సింహాచలం లక్షకు పైగా ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. మొత్తంగా 16.24 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగింది.

సుమారు 13 లక్షల మంది ఓటర్లతో నాలుగు జిల్లాల్లో విస్తరించిన ఈ నియోజకవర్గంపై వైసీపీ పట్టు ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ లోక్ సభ నియోజకవర్గపరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్వతీపురం మినహా మిగతా ఆరింట్లోనూ వైసీపీ అభ్యర్థులే గెలిచారు. అయితే... రీసెంటుగా రంపచోడవరం - పాడేరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో వైసీపీ బలంగానే ఉంది. దీంతో ఈ పార్లమెంటు స్థానాన్ని జనసేనకు కేటాయించాలని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి పొత్తులే కుదిరితే దీనికి పవన్ ఎంతవరకు అంగీకరిస్తారో చూడాలి.

ఇక కాకినాడ స్థానానికి వస్తే అది జనసేనకు సేఫనే చెప్పాలి. కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడం, ఆ పరిధిలో టీడీపీ బలంగా ఉండడంతో జనసేన ఇక్కడ బోణీ చేయొచ్చు. ప్రస్తుతం ఇక్కడ నుంచి టీడీపీ తరఫున తోట నరసింహం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్రంలో మంత్రి పదవి ఆశించి నిరాశపడిన ఆయన ఈసారి అసెంబ్లీకి పోటీ చేసి టీడీపీ గెలిస్తే మంత్రి కావాలన్న యోచనలో ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. దీంతో ఈ స్థానం జనసేనకు ఇస్తే ఇక్కడ వారికి అనుకూలంగా ఉండొచ్చని తెలుస్తోంది.