Begin typing your search above and press return to search.

మ‌హా క‌ష్టంగా మారిన ఆ ముగ్గురు కెప్టెన్ల‌ సీట్లు!

By:  Tupaki Desk   |   8 Oct 2018 4:45 AM GMT
మ‌హా క‌ష్టంగా మారిన ఆ ముగ్గురు కెప్టెన్ల‌ సీట్లు!
X
ఆస‌క్తిక‌ర స‌న్నివేశం తెలంగాణ రాజ‌కీయాల్లో చోటు చేసుకుంటోంది. తెలంగాణ అధికార‌ప‌క్షాన్ని స‌మ‌ర్థంగా ఢీ కొట్టేందుకు వీలుగా మ‌హా కూట‌మి రూపుదిద్దుకున్న వేళ‌.. కొన్ని ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మ‌హా కూట‌మిలో కాంగ్రెస్ తో పాటు టీడీపీ.. టీజేఎస్‌.. సీపీఐలు ఉండ‌నున్నాయి. కాంగ్రెస్ ను మిన‌హాయితే.. మిగిలిన మూడు పార్టీల పేర్లు చెప్పిన వెంట‌నే.. ఎల్ ర‌మ‌ణ‌.. కోదండం మాష్టారు.. చాడా వెంక‌ట‌రెడ్డిలు చ‌ప్పున గుర్తుకు వ‌స్తారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఇప్పుడీ ముగ్గురు కెప్టెన్ల‌కు సీట్లు ఎక్క‌డ ఫైన‌ల్ చేయాల‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

మ‌హా కూట‌మికి సంబంధించి ఇప్ప‌టికే సీట్ల లెక్క ఒక కొలిక్కి రాని వేళ‌.. ఇప్పుడు ఆయా పార్టీల కెప్టెన్ల‌కు సీట్ల‌ను ఎక్క‌డ ఫైన‌ల్ చేయాలో అర్థం కాక కిందా మీదా ప‌డుతున్నారు. కూట‌మి ఏర్పాటు సంద‌ర్భంలో నాలుగు పార్టీలు అనుకున్న బేసిక్ సిద్ధాంతం.. పార్టీల్ని వ‌దిలేసి.. ఏ పార్టీ ఏ సీటును ప‌క్కా గెలుస్తుందో.. ఆ పార్టీకే టికెట్ కేటాయించాల‌ని.

గెలుపు గుర్రాల‌కే త‌ప్పించి.. సీట్లు ఇవ్వాలి కాబ‌ట్టి ఇవ్వ‌టం.. ప్ర‌ముఖ నేత‌ల‌కు త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో సీట్లు కేటాయించ‌టం లాంటి ఖ‌రీదైన త‌ప్పుల్ని అస్స‌లు చేయొద్ద‌న్న మాట అనుకున్నారు. ఇలాంటి వేళ‌.. ఈ ముగ్గురు కెప్టెన్ల‌కు నియోజ‌క‌వ‌ర్గాల్ని కేటాయించ‌టం పెద్ద క‌ష్టంగా మారిందంటున్నారు.

తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఎల్ ర‌మ‌ణ విష‌యాన్నే తీసుకుంటే ఆయ‌న 2009లో జ‌గిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. జీవ‌న్ రెడ్డి ఎంత బ‌ల‌మైన అభ్య‌ర్థో తెలిసిందే.

అలాంట‌ప్పుడు జీవ‌న్ రెడ్డికి కాకుండా ర‌మ‌ణ‌కు ఇవ్వ‌లేరు. అలా అని.. ర‌మ‌ణ‌ను ప‌క్క‌న పెట్ట‌లేని పరిస్థితి. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని త‌న‌కు కేటాయించ‌మ‌ని ర‌మ‌ణ అడ‌గ‌లేని ప‌రిస్థితుల్లో సెకండ్ ఆప్ష‌న్ కింద కోరుట్ల పేరు వినిపిస్తున్నా.. అక్క‌డ నుంచి పోటీకి ర‌మ‌ణ ఆస‌క్తిగా లేర‌ని చెబుతున్నారు.

ఇలాంటి ప‌రిస్థితే తెలంగాణ జ‌న‌స‌మితి అధినేత కోదండం మాష్టారికి ఎదురైంది. ఆయ‌న ఎక్క‌డ నుంచి పోటీ చేయాల‌నే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తొలుత జ‌న‌గామ నుంచి బ‌రిలోకి దిగాల‌ని భావించినా.. అక్క‌డ నుంచి పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల ల‌క్ష్మ‌య్య బ‌రిలో ఉండ‌టంతో కోదండం మాష్టారు మ‌రో సీటును చూసుకోవాల్సి వ‌చ్చింది. ఆయ‌న‌కు ప‌ర్ ఫెక్ట్ గా స‌రిపోయే వ‌రంగ‌ల్ వెస్ట్ స్థానాన్ని నాయిని రాజేంద‌ర్ రెడ్డి.. వేం న‌రేంద‌ర్ రెడ్డిలు బ‌రిలోకి దిగాల‌ని పావులు క‌దుపుతున్నారు. వీరిద్ద‌రూ బ‌ల‌మైన అభ్య‌ర్థులుగా పేరుంది.

ఇలాంటి వేళ‌లో.. కోదండం మాష్టారికి ఏ సీటు కేటాయించాల‌న్న‌ది పెద్ద స‌మ‌స్య‌గా మారింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల సంగ‌తి ఎలా ఉన్నా.. వ‌రంగ‌ల్ వెస్ట్ నుంచి కోదండం మాష్టారిని బ‌రిలోకి దింపితే గెలుపు ఖాయ‌మంటున్నారు. అంతేకాదు.. వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాల్లో ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల మీద కోదండం మాష్టారి ప్ర‌భావం అంతో ఇంతో ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి.. చివ‌ర‌కు మాష్టారి టికెట్ విష‌య‌మై ఏం ఫైన‌ల్ నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

ఇక‌.. సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడా వెంక‌ట‌రెడ్డి వ్య‌వ‌హారం పీట‌ముడిగా మారింది. 2004లో ఆయ‌న హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వ‌హించారు. అయితే.. ఇప్పుడీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున అలిగిరెడ్డి ప్ర‌వీణ్ రెడ్డి బ‌ల‌మైన అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్నారు. ఇప్ప‌టికే ఆయ‌న తానే హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిని అంటూ ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇది చాడాను అసంతృప్తికి గురి చేస్తోంది. సీట్లపై పొత్తు లెక్క‌లు ఒక కొలిక్కి రాని వేళ‌.. ఏ విధంగా ప్ర‌చారం చేసుకుంటార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. కూట‌మిలోని కీల‌క‌మైన మూడు పార్టీల‌కు చెందిన ముఖ్య‌నేత‌ల‌కు సీట్లు కేటాయింపే పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.