Begin typing your search above and press return to search.

తొలి జాబితాలో చోటు ఇవ్వకుండా ప్రముఖులకు షాకిచ్చిన కేసీఆర్

By:  Tupaki Desk   |   19 Nov 2020 8:50 AM GMT
తొలి జాబితాలో చోటు ఇవ్వకుండా ప్రముఖులకు షాకిచ్చిన కేసీఆర్
X
గ్రేటర్ ఎన్నికల్లో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో తాము ఉండాలని.. గత ఎన్నికల మాదిరే భారీగా సీట్లను సొంతం చేసుకోవటంతో పాటు.. రికార్డుస్థాయిలో సెంచరీ కొట్టేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తోంది టీఆర్ఎస్. అయితే.. ఇటీవల వెల్లడైన దుబ్బాక ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బతో టీఆర్ఎస్ మరింత అప్రమత్తమైంది. తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బుధవారం రాత్రి విడుదల చేశారు.

పేరుకు 105 సీట్లను అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లుగా ప్రకటించినప్పటికీ.. ప్రముఖుల కుటుంబ సభ్యులు పోటీ చేసే స్థానాలను పెండింగ్ లో పెట్టి షాకిచ్చారు. ఎమ్మెల్యే సతీమణులు.. సిట్టింగ్ కార్పొరేటర్లుగా ఉన్న వారికి తొలిజాబితాలో చోటు దక్కకపోవటం ఆసక్తికరంగా మారింది. తొలి జాబితాలో చోటు లభించని వారికి.. మలి జాబితాలో కష్టమవుతుందన్న మాట ఇప్పుడు గులాబీ నేతలకు కొత్త టెన్షన్ పుట్టిస్తోంది.

అన్నింటికంటే ఆశ్చర్యం ఏమంటే.. మేయర్ బొంతురామ్మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చర్లపల్లి డివిజన్.. ఈసారి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో.. ఆయనకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. అయితే.. ఆ స్థానంలో బొంతు సతీమణి పద్మకు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆశ్చర్యకరంగా తొలి జాబితాలో చర్లపల్లి డివిజన్ ను చేర్చలేదు. దీంతో.. మేయర్ సతీమణికి టికెట్ లభిస్తుందా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.

ఇక.. అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్.. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాషణ్ రెడ్డి సతీమణులు ఇద్దరూ కార్పొరేటర్లే. అయినప్పటికీ. తొలి జాబితాలో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లకు చోటు దక్కలేదు. అధికార పక్ష ఎమ్మెల్యేలుగా ఉండి కూడా తొలిజాబితాలో చోటు లభించకపోవటంపై వారు ఆందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉంటే.. కంట్మోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పరిస్థితి ఇలాంటిదే. ఆయన కుమార్తె లాస్య నందిత గత ఎన్నికల్లో కార్పొరేటర్ గా విజయం సాధించారు. అయినప్పటికీ.. ఆమెకు తొలి జాబితాలో పేరు ప్రకటించకపోవటం షాకింగ్ గా మారిందంటున్నారు. ఇలా ప్రముఖుల కుటుంబ సభ్యుల పేర్లను పెండింగ్ లో ఉంచటం వారికి ఇబ్బందికరంగా మారిందంటున్నారు.

మరోవైపు.. మంత్రి తలసాని కోడలు ఈసారి గ్రేటర్ బరిలో దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. గ్రేటర్ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయటం లేదని మంత్రి స్వయంగా వెల్లడించారు. అయినప్పటికీ.. బేగంపేట సిట్టింగ్ కార్పొరేటర్ ఉప్పల తరుణి పేరును ఫైనల్ చేయలేదు. పెండింగ్ లో ఉన్న 45 డివిజన్లలో బేగంపేట ఒకటి కావటంతో.. మంత్రి తలసాని కోడలుకు అవకాశం దక్కుతుందా? అన్నదిప్పుడు చర్చగా మారింది.