Begin typing your search above and press return to search.

కొలిక్కి కూట‌మి లెక్క‌లు..ఎవ‌రికెన్ని అంటే?

By:  Tupaki Desk   |   24 Oct 2018 5:25 AM GMT
కొలిక్కి కూట‌మి లెక్క‌లు..ఎవ‌రికెన్ని అంటే?
X
పీట‌ముడులు ప‌డుతూ.. బేర‌సారాలు సాగుతూ.. ఎంత‌కూ తెగ‌ని పంచాయితీగా మారిన తెలంగాణ మ‌హాకూట‌మిలోని భాగ‌స్వామ్య ప‌క్షాల్లో ఎవ‌రు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాల‌న్న విష‌యంపై తాజాగా క్లారిటీ వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం కూట‌మి లెక్క‌ల విష‌యంలో మ‌రింత సాగ‌వేత ధోర‌ణి మంచిదికాద‌న్న భావ‌న‌కు కాంగ్రెస్ వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. తొలుత అనుకున్న‌ట్లుగా వంద స్థానాలు త‌మ చేతిలో ఉంచుకోవాల‌న్న కాంగ్రెస్ ప‌ట్టు స‌డ‌లించుకోవ‌టంతో పాటు.. మిత్రులు కోరిన‌ట్లుగా గౌర‌వ‌నీయ స్థానాల్ని కేటాయించేందుకు సిద్ధ‌మైన‌ట్లుగా చెబుతున్నారు.

కూట‌మిలో చీలిక‌లు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా టీఆర్ ఎస్‌.. బీజేపీ ఎత్తుల్ని చిత్తు చేసేందుకు వీలుగా కాంగ్రెస్ కాస్త త‌గ్గిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. తొలుత తాము అనుకున్న‌ట్లుగా 100 స్థానాల్లో పోటీని కాస్త కుదించుకొని తొంభైకి ప‌రిమితం కావాల‌న్న నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. మిత్రుల‌కు కేటాయించేందుకు వీలుగా 29 స్థానాల్ని కేటాయించారు.

ఇందులో టీడీపీకి 15 స్థానాలు.. కోదండ‌రాం నేతృత్వంలోని తెలంగాణ జ‌న‌స‌మితి 10 స్థానాల్లో.. సీపీఐ నాలుగు స్థానాల్లో పోటీకి ఒప్పుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఒక‌ప్పుడు తెలంగాణ‌లో సీట్ల లెక్క‌ల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన తెలుగుదేశం తాజా ప‌రిణామాల్లో తానే రెండు అడుగులు వెన‌క్కి వేసిన‌ట్లుగా తెలుస్తోంది. మోడీతో పేచీ నేప‌థ్యంలో త‌న‌కు కాంగ్రెస్ స‌హ‌కారం త‌ప్ప‌నిస‌రిగా మారింద‌ని.. అందుకే సీట్ల విష‌యంలో పెద్ద‌గా ప‌ట్టింపులు లేన‌ట్లుగా.. కాంగ్రెస్ ద‌గ్గ‌ర త‌న గౌర‌వాన్ని పెంచుకునేలా వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా చెబుతున్నారు.

మోడీకి వ్య‌తిరేకంగా జ‌ట్టు క‌ట్టే ప‌నిలో బిజీగా ఉన్న చంద్ర‌బాబు.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ స‌హాయ స‌హ‌కారాలు భారీగా అవ‌స‌ర‌మైన నేప‌థ్యంలో.. కాంగ్రెస్‌కు న‌మ్మ‌క‌మైన మిత్రుడిగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. ఆ పార్టీని అన‌వ‌స‌ర‌మైన చికాకులు పెట్ట‌కూడ‌ద‌ని.. చిన్న విష‌యాల‌కు లొల్లి చేసే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించ‌కుండా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఒక రేంజ్లో వాడేసే చంద్ర‌బాబు.. ప్ర‌స్తుతం త‌న‌ను వాడేసేందుకు వీలుగా త‌న స‌హ‌కారాన్ని వ్యూహాత్మ‌కంగా ఇస్తున్న‌ట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్య‌వ‌స్థాగ‌తంగా ఏ మాత్రం లేని తెలంగాణ జ‌న స‌మితికి ప‌ది స్థానాలు ఇస్తుంటే.. టీడీపీ 15 స్థానాల‌కు ప‌రిమితం కావ‌టం వెనుక వ్యూహం ఇదేన‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి కోదండం మాష్టారి పార్టీలో ప‌ది మంది అభ్య‌ర్థులు ఎవ‌ర‌న్న‌ది చూస్తే.. ఇద్ద‌రు ముగ్గురు మిన‌హాయిస్తే.. మిగిలిన వారికి ఎలాంటి ఛ‌రిష్మా లేదు. కాకుంటే.. కోదండం మాష్టారు కూట‌మికి తురుపుముక్క‌లా మార‌టంతో ఆయ‌న పార్టీకి అన్ని భారీ సీట్లు కేటాయించిన‌ట్లుగా తెలుస్తోంది. అన‌ధికారికంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ లెక్క‌ల్లో నిజం ఎంత‌న్న‌ది ఈ నెలాఖ‌రు లోపే తేలుతుందంటున్నారు.