Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు 14.. కోదండరామ్‌ కు 8

By:  Tupaki Desk   |   1 Nov 2018 5:06 AM GMT
చంద్రబాబుకు 14.. కోదండరామ్‌ కు 8
X
తెలంగాణలో పాలక టీఆర్‌ ఎస్‌ ఓటమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీట్ల పంపకాలు త్వరగా తేల్చుకుని ప్రజల్లోకి వెళ్లాలని కూటమిలో పార్టీలు నిర్ణయించాయి. తెలంగాణలోని 119 అసెంబ్లి నియోజక వర్గాలకు గాను తెలుగుదేశం పార్టీ 14 స్థానాల్లో - తెలంగాణ జన సమితి 8 - సీపీఐ 4 స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయించినట్లు సమాచారం. ఈ మూడు పార్టీలకు 26 సీట్లు పోను మిగతా 93 సీట్లలో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేయనుంది. అయితే సీట్ల సంఖ్యల విషయంలో అంగీకారం కుదిరినా ఏఏ సీట్లనే విషయంలో ప్రతిష్టంభణ కొనసాగుతోంది.

ఇక ఈ సీట్ల పంచాయతీ దిల్లీ కేంద్రంగా రాహుల్ గాంధీ సమక్షంలో తేలనుంది. శుక్రవారం ఉదయం స్పష్టమైన ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - ప్రచార కమిటి చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క - సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి - మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ తదితరులు బుధవారమే దిల్లీ వెళ్లినప్పటికీ రాహుల్ - కోదండల భేటీ శుక్రవారం జరగనుంది. అది పూర్తయ్యాకే లెక్క తేలుతుందని సమాచారం.

కాగా కేసీఆర్ ఓటమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ కూటమిలో టీడీపీ గొంతెమ్మ కోర్కెలు కోరనప్పటికీ తెలంగాణ జన సమితి మాత్రం తనకు ఎక్కువ సీట్లు కావాలని పట్టు పట్టింది. కోరినన్ని సీట్లు ఇవ్వకుంటే కూటమి నుంచి బయటకొస్తానని కూడా జనసమతి నేతలు హెచ్చరించారు. అయితే... అందరి లక్ష్యం ఒకటే కాబట్టి కొంత పట్టువిడుపుతో వెళ్లాలని కోదండరాంకు పలువురు నేతలు నచ్చజెప్పడంతో ఆయన 8 సీట్లకు సరేనన్నట్లు సమాచారం.