Begin typing your search above and press return to search.

కేటాయింపు కాంగ్రెసుకా.. టీడీపీకా? తీవ్ర చర్చ

By:  Tupaki Desk   |   8 Nov 2018 10:51 AM GMT
కేటాయింపు కాంగ్రెసుకా.. టీడీపీకా? తీవ్ర చర్చ
X
కాంగ్రెస్ అంటేనే సీల్డ్ కవర్ రాజకీయాలనే పేరుంది.. ఏ పదవి చేపట్టాలన్నా అందులో పేరుండాలి. లేకపోతే ఎన్ని లాబీయింగ్ లు చేసినా ప్రయోజనం శూన్యం. తెలంగాణ ఎన్నికల వేళ ఏర్పడిన మహా కూటమి లో కాంగ్రెస్ దే అగ్రస్థానం. మిత్ర పక్షాలకు పంచగా మిగిలిన సీట్లన్నీ హస్తం గుర్తు ఆశావహులవే. మరికొన్ని గంటల్లో టిక్కెట్ల ప్రకటన చేస్తారని అంటుండంతో తమ పేరు ఉంటుందో లేదోనని తెగ హైరానా పడిపోతున్నారు.

టీఆర్ ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసి ప్రచార రంగంలోకి వెళ్లిపోయింది. బీజేపీ పోటీ చేసే స్థానాలు ఏవో తెలిసిపోయింది. ఇక మిగిలింది ప్రధాన మహా కూటమిదే. టీడీపీ - కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారో తెలిశాక అసలు రాజకీయ ప్రచారం మొదలవుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో అటు టీడీపీ - ఇటు కాంగ్రెస్ నేతలు పలు స్థానాల్లో పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. తమకు ఈ సారి పోటీ చేసే ఛాన్స్ వస్తుందా అని కాంగ్రెస్ అశావహుల్లో టెన్సన్ మొదలైంది. నిజామాబాద్ జిల్లా పరిస్థితిని పరిశీలిస్తే...

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బోధన్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి - కామారెడ్డి నుంచి శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీలకు తొలి జాబితాలో చోటు దక్కుతుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. ఆర్మూర్ నుంచి ఎమ్మెల్సీ ఆకుల లలితకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించవచ్చని భావిస్తున్నారు. మిగిలిన స్థానాల్లో నలుగురు ఐదుగురు ఆశావహులు పోటీ పడుతున్నారు. ఇవే స్థానాలు టీడీపీ కూడా డిమాండ్ చేస్తుండటంతో అందరిలోనూ బీపీ పెరిగిపోతుందట.

బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరుపున మళ్లీ పోటీ చేసేందుకు మాజీ ప్రభుత్వ విప్ అనిల్ కుమార్ పోటీకి రెడీ అవుతున్నారు. అటు టీడీపీ కూడా ఇదే స్థానాన్ని కోరుతుంది. పచ్చ పార్టీ నుంచి మల్లికార్జున్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు.

ఇక, నిజామాబాద్ రూరల్ విషయంలో పెద్ద అలజడే రేగుతుందట. టీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నర్సారెడ్డి కూడా టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. రేవంత్ తో పాటు కాంగ్రెస్ లో చేరిన నర్సారెడ్డి - టిక్కెట్ కన్ ఫాం చేసుకున్నాకే పార్టీలోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, నిజామాబాద్ రూరల్ ను టీడీపీ కూడా డిమాండ్ చేస్తుందట. ఒకప్పడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన నిజామాబాద్ రూరల్ ను వదిలేసి ప్రసక్తే లేదని అంటుంది. టీడీపీ నుంచి మండవ వెంకటేశ్వరరావును పోటీకి దించితే తమ పరిస్థితి ఏంటని ఇద్దరూ మదనపడిపోతున్నారట.

కాంగ్రెస్ సీల్డ్ కవర్ గుట్టు విప్పిన తరువాత టిక్కెట్ దక్కని ఆశావహులు అసమ్మతిగా మారిపోయే అవకాశం లేకపోలేదు. దీంతో వారిని బుట్టలో వేసుకునేందుకు టీఆర్ ఎస్ వేచి చూస్తుంది. చివరికి ఫలితం ఉండబోతుందో వేచి చూడాల్సిందే.