Begin typing your search above and press return to search.

మార్చి 1 నుంచి సెకండ్ ఫేజ్.. వ్యాక్సిన్ కు ఫీజు.. 20వేల ఆసుపత్రుల్లో ఏర్పాట్లు!

By:  Tupaki Desk   |   24 Feb 2021 4:08 PM GMT
మార్చి 1 నుంచి సెకండ్ ఫేజ్.. వ్యాక్సిన్ కు ఫీజు.. 20వేల ఆసుపత్రుల్లో ఏర్పాట్లు!
X
రెండో విడ‌త క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు దేశంలో ముమ్మ‌రంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. మార్చి 1 నుంచి ప్రారంభం కానున్న‌ ఈ ద‌శ‌లో మ‌రింత మందికి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. వీరంద‌రికీ టీకా వేసేందుకుగానూ దేశ‌వ్యాప్తంగా 20,000 ప్రైవేట్ హాస్పిటళ్లను ఎంపిక చేసింది కేంద్రం. ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ న‌డుస్తున్న 10 వేల ప్రభుత్వ ఆస్పత్రులకు ఇవి అద‌నం.

అయితే.. ఈ ప్రైవేట్ కేంద్రాల్లో టీకా వేయించుకునేవారు కొంత డ‌బ్బు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ బుధ‌వారం వెల్ల‌డించారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం వ్యాక్సిన్ ఉచితంగానే పంపిణీ చేయనుండగా.. ప్రైవేట్ కేంద్రాల్లో నామిన‌ల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు మంత్రి. అయితే.. ఆ ఫీజు ఎంత అనేది మూడు నాలుగు రోజుల్లో నిర్ణయిస్తామన్నారు మంత్రి.

కాగా.. ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో వినియోగించే సిరంజీ ఖర్చులు, ఇత‌ర వ‌న‌రుల వ్య‌యం క‌లిపి సాధారణ ధర నిర్ణయిస్తారని వైద్యులు చెబుతున్నారు. మలి విడత వ్యాక్సినేషన్‌లో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ టీకా ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఇదిలా ఉండ‌గా.. దేశంలో కరోనా వ్యాక్సిన్ మొద‌టి ద‌శ‌ కార్యక్రమం వేగంగా జరుగుతోంది. బుధవారం ఉదయం వ‌రకు 1,21,65,598 మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. కాగా.. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయ‌ని వెల్ల‌డించింది.