Begin typing your search above and press return to search.

కోవిడ్-19 ఫ్రీ కంట్రీగా నార్త్ కొరియా... రహస్యమేంటో?

By:  Tupaki Desk   |   9 April 2020 3:30 AM GMT
కోవిడ్-19 ఫ్రీ కంట్రీగా నార్త్ కొరియా... రహస్యమేంటో?
X
కోవిడ్-19 వైరస్ ఎంట్రీ కాని దేశమంటూ లేదంటే ఇప్పుడు అతిశయోక్తి కాదేమో. చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా.. ఇప్పటిదాకా ఏకంగా 206 దేశాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే నియంతృత్వ పోకడలకు పెట్టింది పేరైన ఉత్తర కొరియాలో మాత్రం ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరోనా పుట్టుకకు కేంద్రమైన చైనాతో పాటు కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న దక్షిణ కొరియా సరిహద్దులుగా కలిగిన దేశమైన నార్త్ కొరియాలో ఇప్పటిదాకా సింగిల్ కరోనా కేసు కూడా నమోదు కాలేదంటేనే అశ్చర్యం కలగక మానదు. ప్రపంచమంతా కరోనాతో వణికిపోతూ ఉన్న ప్రస్తుత తరుణంలో సింగిల్ పాజిటివ్ కేసు కూడా లేదని చెబుతున్న ఉత్తర కొరియాను చూస్తుంటే... నిజంగానే మిస్టరీ ఏదో ఉందని అనుమానించక తప్పదు. ఆ మిస్టరీ వెనుక ఉన్న కారణాలేమిటో చూద్దాం పదండి.

ఉత్తర కొరియాలో కోవిడ్ పరీక్షలు జరుగుతున్నా, 500 మందికి పైగా క్వారంటైన్‌ లో ఉన్నా...ఇంతవరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డీపీఆర్‌ కే)లో డబ్లుహెచ్ ఓ ప్రతినిధి డాక్టర్ ఎడ్విన్ సాల్వడార్ చెబుతున్నారు. ఉత్తర కొరియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ప్రతివారం కోవిడ్ తాజా సమాచారం డబ్ల్యూహెచ్‌ ఓకు అందుతుంటుంది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌ యాంగ్‌ లోని నేషనల్ రిఫరెన్స్ ల్యాబరేటరీలో కరోనా వైరస్ పరీక్షలు పూర్తి స్థాయిలో నిర్వహిస్తుంటారు. 'ఏప్రిల్ 2 వరకూ - 11 మంది విదేశీయులు - 698 మంది ఉత్తర కొరియా వాసులతో కలిపి మొత్తం 709 మందికి కరోనా వైరస్ పరీక్షలు జరిపారు. అయితే ఒక్క కేసు కూడా ఇంతవరకూ నమోదు కాలేదు. 509 మంది క్వారంటైన్‌ లో ఉన్నారు. వారిలో 507 మంది స్వదేశీయులు - ఇద్దరు విదేశీయులు ఉన్నారు' అని డాక్టర్ సాల్వడార్ తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 31 నుంచి 24,842 మందిని క్వారంటైన్ నుంచి డిశ్చార్చ్ చేయగా - ఇందులో 380 మంది విదేశీయులు కూడా ఉన్నట్టు ఆయన తెలిపారు.

గత జనవరిలో పీసీఆర్ డయోగ్నోస్టిక్ పరీక్షల కోసం అవసరమైన సహకారం చైనా అందించినట్టు సాల్వడార్ చెబుతున్నారు. వ్యాధి నిరోధక సామాగ్రిని డబ్ల్యుహెచ్ ఓ అందించింది. డబ్ల్యుహెచ్ ఓ వెబ్‌ సైట్‌ లో వెల్లడించిన తాజా వివరాల ప్రకారం, -ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ల కరోనా కేసులు - 72,614 మరణాలు నమోదయ్యాయి. 206 దేశాల నుంచి ఈ గణాంకాలు నమోదు కాగా - నార్త్ కొరియా - తజికిస్థాన్, -తుర్కెమెనిస్థాన్‌ - యెమెన్‌ వంటి దేశాల్లో మాత్రం ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో అణ్వస్త్ర - క్షిపణి కార్యక్రమాలను నిరోధించేందుకు నార్త్ కొరియాపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తివేయాలని ఐక్యరాజ్యసమతి మానవ హక్కుల నిపుణుడు ఒకరు పిలుపునిచ్చారు. కరోనా విస్తరణతో ప్రపంచ దేశాల్లో ఆకలికి అలమటిస్తున్న ప్రజలకు ఆహార సామగ్రిని సరఫరా చేసేందుకు ఈ ఆంక్షల సడలింపు ఎంతగానో ఉపకరిస్తుందని ఆయన అన్నారు.

కాగా, గత ఫిబ్రవరి 9 నుంచి ఆరు వారాల పాటు సుమారు 7,300 మంది పర్యాటకులకు నార్త్ కొరియా పరీక్షలు నిర్వహించినట్టు డబ్ల్యూహెచ్ ఓ కార్యాలయం తెలిపింది. ఇందులో జ్వరంతో బాధపడుతున్న 141 మంది పర్యాటకులకు పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్‌ గా పరీక్షల్లో తేలినట్టు చెప్పింది. వీటికి తోడు - సరిహద్దు తనిఖీలను నార్త్ కొరియా కట్టుదిట్టం చేయడంతో పాటు, క్వారంటైన్ చర్యలు కూడా తప్పనిసరి చేసింది. దక్షిణ కోరియాలోని యూఎస్ బలగాల అధిపతి ఇచ్చిన సమాచారం ప్రకారం - గత మార్చి మధ్యలో ఉత్తర కొరియా తమ దేశ సైనిక దళాలకు 30 రోజుల పాటు లాక్‌డౌన్ విధించి - తిరిగి ఇటీవలే శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించింది. జనీవాలోని యూఎన్ కార్యాలయంలో నార్త్ కొరియా దౌత్యవేత్త ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 'మేము లాక్‌ డౌన్‌ లో ఉన్నాం. కరోనా వైరస్ విస్తరించకుండా మేము చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడాన్ని నేను గమనించాను' అని ఆయన తెలిపారు. మొత్తంగా అన్ని దేశాల కంటే కాస్త ముందుగానే... అది కూడా దేశ సరిహద్దులను లాక్ డౌన్ చేయడం ద్వారా నార్త్ కొరియా తనను తాను కోవిడ్-19 నుంచి రక్షించుకుందని చెప్పక తప్పదేమో.