Begin typing your search above and press return to search.

ఓవైసీ ఏపీ ఫోక‌స్ వెనుక లెక్క‌లు ఇవా?

By:  Tupaki Desk   |   13 Dec 2018 10:26 AM GMT
ఓవైసీ ఏపీ ఫోక‌స్ వెనుక లెక్క‌లు ఇవా?
X
వివాదాస్పద- సంచల‌న వ్యాఖ్యల కు ఎంఐఎం అధినేత- ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పెట్టింది పేరు. త‌న‌దైన శైలి లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయాలు న‌డిపించే ఓవైసీ ఇటీవ‌ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ తో స‌ఖ్య‌త‌గా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా తాజాగా ఓవైసీ మీడియా తో మాట్లాడుతూ ఏపీ లో తాను ప్రచారం చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో చంద్రబాబుకు రుచి చూపిస్తాననీ.. ఏపీ కి వెళ్లి జగన్ కు మద్దతిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తన సొంత రాష్ట్రంలోనే వ్యతిరేకత ఉందనీ.. వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానాలు రెండు కూడా గెలవలేరని ఒవైసీ జోస్యం చెప్పారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసినా తెలంగాణ లో చంద్రబాబు ఫలితాలు సాధించలేకపోయారని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారంతో గులాబీ బాస్ కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏపీ ఎన్నికలల్లో తాము కూడా వేలు పెడతామనీ కేసీఆర్- కేటీఆర్ కూడా ప్రకటించటం ఇందుకు నిద‌ర్శ‌నం. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాతే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఏపీ రాజ‌కీయాల గురించి ప్ర‌స్తావించారు. ఓవైసీ ఇంత ధైర్యంగా చెప్ప‌డం వెనుక కార‌ణం... ఏపీ లో మైనార్టీ ఓట్లు కూడా కీల‌కంగా ఉండ‌ట‌మేన‌ని అంటున్నారు. రాయలసీమలోని కర్నూలు- అనంతపురం- కడపజిల్లాల్లో మైనార్టీ ఓటు బ్యాంకు గెలుపు ఓట‌ముల‌ను నిర్దేశిస్తుంది. దీనికి తోడుగా రాజ‌ధాని అమరావతి పరిధిలోని గుంటూరు- కృష్ణా జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లోనూ మైనార్టీ ఓటు బ్యాంకు బలంగానే ఉంది. ఈ నేప‌థ్యంలో త‌న ప్ర‌చారం ద్వారా చంద్ర‌బాబు తీరును ఎండ‌గ‌ట్టాల‌నేది ఓవైసీ లెక్క అని అంటున్నారు.

ఓ వైపు త‌మ మిత్ర‌ప‌క్షం అయిన టీఆర్ఎస్‌ కు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన చంద్ర‌బాబును ఎదుర్కోవ‌డం అదే స‌మ‌యంలో తాము మ‌ద్ద‌తిస్తామ‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కి అండ‌దండ‌గా ఉండ‌టం ఓవైసీ ల‌క్ష్య‌మంటున్నారు. అందుకే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్షంగా పోటీ చేయ‌క‌పోయినా... రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప‌ర్య‌టించి చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపించ‌డ‌మే ల‌క్ష్యంగా సాగ‌వ‌చ్చంటున్నారు. అందుకే రెండు ఎంపీ సీట్లు కూడా గెల‌వ‌లేర‌ని ఓవైసీ బాజాప ప్ర‌క‌టించార‌ని పేర్కొంటున్నారు. కాగా, తనకు మద్దతిస్తానని అసదుద్దీన్ ప్రటకటించం పై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి. అదే స‌మ‌యంలో ఏపీ లో 2019లో రానున్న అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ ఎన్నికల కంటే వాడీ వేడీగా జరగడం ఖాయ‌మంటున్నారు.