Begin typing your search above and press return to search.

ఇది.. సౌదీ రాజు రహస్య భార్య కథ

By:  Tupaki Desk   |   5 Nov 2015 4:25 AM GMT
ఇది.. సౌదీ రాజు రహస్య భార్య కథ
X
అయన అసలే రాజు. ఇక.. ఆయన ఇష్టానికి తిరుగు ఏముంటుంది చెప్పండి. సౌదీ అరేబియాకు అత్యుత్తమ పాలకుల్లో ఒకరిగా పేరొంది.. ఇటీవల మరణించిన రాజు ఫహద్ కు సంబంధించిన ఒక రహస్య విషయం తాజాగా బయటకు వచ్చింది. ఆయన 19 ఏళ్ల వయసులో జరిపిన ప్రేమాయణం.. ఆపై పెళ్లి చేసుకొన్న విషయాలు బయట ప్రపంచానికి తెలిసిపోయాయి. ఇస్లాంను తూచా తప్పకుండా పాటించే దేశానికి రాజుగా.. ఇస్లాం మత ధర్మానికి పోషకుడిగా ఉంటూ.. నియమనిబంధనల విషయంలో కరకుగా వ్యవహరించే దేశానికి చెందిన రాజు వ్యక్తిగతంగా ఎలా ఉన్నారో ఈ ఉదంతం చెప్పేస్తుంది.

ఈ ముస్లిం రాజు కోరుకోవాలే కానీ ప్రపంచంలో పాదాక్రాంతం కానిది ఏమీ ఉండదు. సౌదీ రాజు ఫహద్ తన 19 ఏళ్ల వయసులోనే ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లాడారు. క్రిస్టియన్ పాలస్తీనియన్ కుటుంబంలో పుట్టిన జనన్ హార్బ్ ప్రేమలో పడ్డ నాటి యువరాజు 1968 మార్చిలో ఆమెను రహస్యంగా పెళ్లాడారు.

వారు పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకు ఆమె ఇస్లాంలోకి మారారు. తర్వాత మూడుసార్లు గర్భం ధరించగా.. నాటి యువరాజు ఆమెకు సర్దిచెప్పి గర్భస్రావాలు చేయించారు. సౌదీ ప్రజలు ఇస్లాంను కఠినంగా ఆచరిస్తారని.. క్రిస్టియన్ అయిన ఆమెను అంగీకరించరని సర్ది చెప్పిన ఫహద్.. ఆమె వ్యవహారాన్ని రహస్యంగానే ఉంచేశారు. అనంతరం ఆయనకు 1982లో రాజుగా పట్టాభిషేకం చేశారు. తన భవిష్యత్తు గురించి ఆందోళన పడిన ఆమెకు.. అలాంటి భయాలు అక్కర్లేదని.. జీవితాంతం ఇబ్బంది లేకుండా తాను చూసుకుంటానని మాట ఇచ్చారు.

ఇందులో భాగంగా ఆమెకు 12 మిలియన్ పౌండ్ల డబ్బు, థేమ్స్ నదీ పరిసరాల్లో రెండు ఫ్లాట్లు ఇస్తామని చెప్పినా తనకు ఎలాంటి ఆస్తి ఇవ్వలేదంటూ తాజాగా హార్బ్ బయటపెట్టారు. సౌదీ రాజుతో ఆమెకు తెగ తెంపులు జరిగాక ఆమె రెండు పెళ్లిళ్లు.. వాటిలో విడాకులు జరిగిపోయాయి.

ప్రస్తుతం బ్రిటీష్ జాతీయురాలైన ఆమె.. తనకివ్వాల్సిన మొత్తం గురించి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో.. రహస్య భార్యగా ఉన్న ఆమె ఉదంతం ప్రపంచానికి తెలిసిపోయింది. తాజాగా ఈ వ్యవహారంపై విచారించిన కోర్టు హార్ప్ కు 15 మిలియన్ పౌండ్లు చెల్లించాలని.. ఒక్కొక్కటి 5 మిలియన్ పౌండ్లు విలువ చేసే రెండు ఫ్లాట్లు ఇవ్వాలని ఆదేశించింది. 28 రోజుల వ్యవధిలో సౌదీ రాజు కుమారుడు అబ్దుల్ అజీజ్ కానీ అప్పీల్ చేసుకోకపోతే హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయాల్సి ఉంటుంది. మరి.. తండ్రిగారి ఒకనాటి రహస్య భార్యకు ఆయన కుమారుడు.. నేటి రాజు అబ్దుల్ ఒప్పుకుంటారా? కోర్టు చెప్పినట్లుగా ఈ భారీ మొత్తాన్ని చెల్లిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.