Begin typing your search above and press return to search.

విభజన చట్టంలో సెక్షన్ 26 ఏం చెబుతోంది?

By:  Tupaki Desk   |   28 July 2016 5:53 AM GMT
విభజన చట్టంలో సెక్షన్ 26 ఏం చెబుతోంది?
X
రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయే సమయంలో తయారు చేసిన విభజన చట్టం చాలా బుజ్జిగా ఉండటాన్ని చూసినప్పుడు ఇంతే కదా? అని అనుకున్నోళ్లు ఉన్నారు. అయితే.. ఆ బుజ్జి పుస్తకంలోని ప్రతి పదం ఎంత విలువైనదో.. ఆ పదాలతో మొత్తం పరిస్థితే మారతుందన్న విషయం ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది. తాజాగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్స్ రాజ్ గంగారాం వ్యాఖ్యలు చూసినప్పుడు.. విభజన చట్టంలోని ఒక్క పదం ఎంత ఇబ్బందికరంగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

విభజన చట్టాన్ని యమా స్పీడ్ తో తయారుచేసిన కారణమో.. లేక పలువురి అభిప్రాయాల్ని తీసుకునే విషయంలో జరిగిన పొరపాటో కానీ.. చాలానే చికాకులు ఎదరవుతున్న పరిస్థితి. చట్టంలో పేర్కొన్న అంశాలు.. అమలు వరకూ వచ్చేసరికి వాటికి చాలానే న్యాయసంబంధమైన.. రాజ్యాంగ సంబంధమైన సమస్యలు తెర మీదకు రావటం గమనార్హం.

రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్ని పెంచుకోవాలని ఆశ పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీవ్ర నిరాశకు గురి చేసేలా తాజాగా కేంద్ర సహాయ మంత్రి పెంపు.. గింపు లేదని చెప్పటమే కాదు.. విభజన చట్టంలోనిసెక్షన్ 26 ప్రకారం చెప్పిన అంశం అమలు సాధ్యం కాదని తేల్చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014లో సెక్షన్ 26 ఏం చెబుతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రెండు అసెంబ్లీల్లో శాసనసభ సభ్యుల సంఖ్యను పెంచుకోవచ్చంటూ ఊరించే మాటలతో పాటు.. వాటి అమలు అంత సులభం కాకుండా తయారుచేసిన పద బంధం.. ఇప్పుడు ఇద్దరు చంద్రుళ్లకు గుదిబండగా మారిందని చెప్పాలి. ఇంతకీ సెక్షన్ 26 చెప్పిందేమంటే.. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో పొందుపరిచిన నిబంధనలకు లోబడి శాసనసభా స్థానాల పునర్ వ్యవస్థీకరణ చేపొచ్చు’’ అని పేర్కొంది. అంటే సెక్షన్ 26ను అమలు చేయాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 రూల్ ని ఫాలో కావాలన్న మాట.

ఈ లెక్కన ఆర్టికల్ 170ను ఫాలో అయి చూస్తే.. ‘‘2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టాల్సి ఉంది’’ అని ఉంది. దీంతో.. విభజన చట్టంలో సీట్ల సంఖ్యను పెంచే ఊరింపు మాట ఉన్నా.. దాని అమలుకు సాధ్యం కానట్లుగా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కు లింకు పెట్టటం గమనార్హం. ఒకవేళ.. విభజన చట్టంలో సెక్షన్ 26 కానీ.. అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచుకోవటానికి వీలుగా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ను సవరించాలి అన్నమాటను పెట్టి ఉంటే.. ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని చెప్పొచ్చు. ఏమైనా.. విభజన చట్టం ఇద్దరుచంద్రుళ్లకు షాకింగ్ యవ్వారమేనని చెప్పక తప్పదు.