Begin typing your search above and press return to search.

సామాన్యుడి పై మరింత భారం...

By:  Tupaki Desk   |   10 Dec 2021 5:00 AM IST
సామాన్యుడి పై మరింత భారం...
X
ఈనెల ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు జరిగిన భారతీయ రిజర్వు బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం బుధవారంతో ముగిసింది. ఈ సమీక్షలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు వివరించారు. గతంలో మాదిరిగానే కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్నట్లుగా రేపో, రివర్స్ రెపో రేట్లను 4, 3.35 శాతంగానే ఉంచుతున్నట్లు వివరించారు.

దేశీయంగా అంతకంతకూ వ్యాప్తి చెందుతున్న కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు శక్తికాంత దాస్ మీడియాకు తెలిపారు. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బిఐ నిర్ణయం తీసుకోవడం ఇది తొమ్మిదో సారి. నిపుణులు చెప్పినట్టుగానే వడ్డీరేట్లను ఎలాంటి మార్పు చేయడం లేదని ఆర్బిఐ స్పష్టం చేసింది.

ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ యూపీఐ పేమెంట్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే యూపీఐ పేమెంట్ కు సంబంధించి ఓ కీలక పత్రాన్ని విడుదల చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా యూపీఐ పేమెంట్ ను మరింతగా పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇందుకుగాను యూపీఐ పేమెంట్స్ ఆధారిత ఫీచర్ ఫోన్లను తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. ఆర్బిఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టి చూస్తే త్వరలోనే యూపీఐ పేమెంట్స్ మీద అదనపు చార్జీలను వసూలు చేసేందుకు ప్రభుత్వం భావిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

నోట్ల రద్దు తర్వాత యూపీఐ పేమెంట్స్ అతి తక్కువ కాలంలోనే బాగా పుంజుకున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పేమెంట్స్ కు బాగా అలవాటు పడ్డారు. దీనికితోడు కరోనా సమయంలో ఎక్కువమంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కి ఎక్కువ ఆసక్తి చూపించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు జరుగుతున్న పేమెంట్స్ సుమారు 550 శాతానికి పైన ఉన్నట్లు ఓ నివేదిక చెబుతోంది.

భారత్లో డిజిటల్ విప్లవాన్ని కొత్తపుంతలు తొక్కించడం లో యూపీఐ పేమెంట్స్ ది ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ లాంటి అప్లికేషన్ లతో ఈ పేమెంట్స్ జోరందుకున్నాయి.

ప్రతి నెల సుమారు 122 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో జరుగుతున్న ఈ యూపీఐ పేమెంట్స్ పైన చార్జీలను వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు శక్తికాంత్ దాస్ వెల్లడించిన దాని ప్రకారం స్పష్టమవుతుంది. మరి ప్రభుత్వం దేనికి ఓటు వేస్తుందో చూడాలి.