Begin typing your search above and press return to search.

అగ్నిప‌థ్ : ఆ ఒక్క‌డే అంతా చేశాడా ?

By:  Tupaki Desk   |   23 Jun 2022 7:30 AM GMT
అగ్నిప‌థ్ : ఆ ఒక్క‌డే అంతా చేశాడా ?
X
అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని వ్య‌తిరేకిస్తూ.. ఆర్మీలో పార్ట్ టైం రిక్రూట్మెంట్లు వ‌ద్దే వ‌ద్ద‌ని చెబుతూ..నిర‌సిస్తూ..సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లో జ‌రిగిన విధ్వంసానికి సంబంధించి కొన్ని కీల‌క‌మైన వీడియోలు వెలుగు చూశాయి. ఆదిలాబాద్ కు చెందిన పృధ్విరాజ్ అనే యువ‌కుడు .. స్టేష‌న్లో నిలుపుద‌ల చేసిన రైలు లో ప్ర‌వేశించి బెర్తుకు మంట పెడుతున్న దృశ్యాలు వెలుగు చూశాయి.

అంతేకాకుండా అత‌నితో పాటు వ‌చ్చిన యువ‌కులు ఏ విధంగా రైల్వే స్టేష‌న్ విధ్వంసానికి పాల్ప‌డింది అన్న‌ది కూడా ఇవే వీడియోల్లో స్ప‌ష్టంగా వెలుగు చూశాయి. పృధ్విరాజ్ త‌ల్లిదండ్రుల వాద‌న మ‌రో విధంగా ఉంది.

త‌మ కుమారుడు నాలుగేళ్ల కింద‌ట సాయి డిఫెన్స్ అకాడ‌మీలో జాయిన్ అయ్యాడ‌ని, కోచింగ్ తీసుకుంటున్నాడ‌ని, వాళ్లు పిలిస్తేనే సికింద్రాబాద్ స్టేష‌న్-కు వెళ్లి ఉంటాడ‌ని, ఇందులో అత‌ని ప్రమేయం లేకుండానే అంతా జ‌రిగిపోయింద‌ని అంటున్నారు. త‌మ కుమారుడు ఇలా చేస్తాడ‌ని తాము అనుకోలేద‌ని కూడా వీరు అంటున్నారు. త‌మ కుమారుడు ఫోన్ స్విచ్చాఫ్‌-లో ఉంద‌ని, త‌మ‌కు న్యాయం చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు.

ఈ ఘ‌ట‌న‌లో పృధ్వీ ఒక్క‌డే నిందితుడు కాదు. అత‌ని పేరు నిందితుల జాబితాల్లో 12వది. ఇంకా చాలామంది పేర్లు కూడా విన‌ప‌డుతున్నాయి. నేరుగా ప్ర‌మేయం ఉన్నా లేక‌పోయినా ఘ‌ట‌నాస్థ‌లిలో ఉంటూ కొన్ని విధ్వంస‌క చ‌ర్య‌ల‌కు, అల్ల‌ర్ల‌కు స‌హ‌క‌రించిన వారి పేర్లు కూడా విన‌ప‌డ‌తున్నాయి. ఇదే క్ర‌మంలో ఇప్ప‌టికే తెలంగాణ‌కు చెందిన ఓ విద్యార్థి ఆత్మ‌హ‌త్యాయ‌త్నంకు పాల్ప‌డ్డాడు.

త‌ల్లిదండ్రులు అప్ర‌మ‌త్త‌మై ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డంతో ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌పడ్డాడు. ఈ కేసుకు సంబంధించి ఇంకొంద‌రిని కూడా నిన్న‌టి వేళ పోలీసులు అరెస్టులు చేశారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కూడా రైల్వే పోలీసులు వాటికి ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం కొస‌మెరుపు.

ఇప్ప‌టిదాకా ఉన్న స‌మాచారం అనుస‌రించి ఈ కేసుకు సంబంధించి పృథ్వీతో పాటు పోలీసుల అదుపులో మరో 9మంది ఉన్నారు. వీరంద‌రినీ విచారిస్తూ ఉన్నారు. వీరందరి నుంచి కొన్ని వివ‌రాలు సేక‌రించాక, మిగిలిన వారిని వారి వాట్సాప్ స్టేట‌స్ ల‌నూ ప‌రిశీలించ‌నున్నారు. కేసుకు సంబంధించి నేరం రుజువు అయితే పృధ్వీకి క‌ఠిన శిక్ష‌లే పడే అవ‌కాశం ఉంది. అదేవిధంగా ఈ నేరంలో నేరుగానో, ప‌రోక్షంగానో పాల్గొన్న ఏ ఒక్క‌రికీ ఏ ప్ర‌భుత్వ ఉద్యోగంకు అప్లై చేసుకునే అవ‌కాశ‌మే ఉండ‌దు.